ఈ రోజు ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో, ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ తొలిస్థానం సాధించగా, తెలంగాణ రెండో స్థానం, హర్యాణ మూడోస్థానంలో నిలిచాయి. సంస్కరణలు, కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం, వరల్డ్ బ్యాంక్ ఈ ర్యాంకులు ప్రకటించాయి. ఏపీ, తెలంగాణలకు పాయింట్లలో చాలా స్వల్ప తేడా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో భాగస్వామ్య సదస్సులు జరగడం.. అనేక కంపెనీలతో వేల కోట్ల రూపాయల ఒప్పందాలు జరగడం, సులభతర వాణిజ్య విధానాలు ఉండటంతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందని కేంద్రం చెప్పింది.
ఆస్తుల రిజిస్ట్రేషన్లలో ఛత్తీస్‌గఢ్, యుటిలిటీ అనుమతుల్లో యూపీ, నిర్మాణ రంగ అనుమతుల్లో రాజస్థాన్, కార్మిక చట్టాల్లో పశ్చిమబెంగాల్, పర్యావరణ రిజిస్ట్రేషన్లకు సంబంధించి కర్ణాటక, భూమి లభ్యతలో ఉత్తరాఖండ్, పన్నుల చెల్లింపులో ఒడిశా, ఐటీ పారదర్శకతలో మహారాష్ట్ర 100శాతం స్కోర్ సాధించాయి. ఎక్కువ పురోగతి సాధించిన రాష్ట్రాలుగా అసోం, తమిళనాడు ఎంపికయ్యాయి. 95 శాతంపైబడి సంస్కరణలు అమలు చేసిన 9 రాష్ట్రాలను 'టాప్ అచీవర్స్'గా గుర్తించింది కేంద్రం. 90 నుంచి 95 శాతం మేర సంస్కరణలు అమలు చేసిన 6 రాష్ట్రాలను 'అచీవర్స్'గా గుర్తించారు. 80 నుంచి 90 శాతం మేర సంస్కరణలు అమలు చేసిన 3 రాష్ట్రాలను 'ఫాస్ట్ మూవర్స్' గా గుర్తించింది. 80 శాతం లోపు సంస్కరణలు అమలు చేసిన 18 రాష్ట్రాలను 'ఆస్పైరర్స్'గా ప్రకటించింది.
అయితే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటం ఫై, కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. కేంద్రం ప్రకటించిన సులభతర వాణిజ్య ర్యాంకుల్లో తొలి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. 0.09 శాతం తేడాతో ఈవోడీబీలో తెలంగాణకు తొలి ర్యాంకు తప్పిందన్నారు. అధికారులు కనబరిచిన మంచి పనితీరు వల్ల ఈ ఏడాదీ మంచి ర్యాంకు సాధించామని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. "We missed the 1st spot in EODB rankings 2018 by a whisker; 0.09% Nevertheless, inspirational leadership from @TelanganaCMO Garu & good work by our bureaucracy has resulted in a good rank this year too???? Congratulations to Andhra Pradesh led by @ncbn Garu on topping the list ????"