ఏపీ సీఎం చంద్రబాబు వందశాతం ఓడిపోతారు అంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం ఓటమికి కృషి చేసే కేసీఆర్, ఆయన సహచరులకు భంగపాటు తథ్యమని జోస్యం చెప్పారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ‘‘ఢిల్లీ మోడీ గారు, తెలంగాణ మోడీ కేసిఆర్ గారు, ఆంధ్రా మోడీ జగన్ గారికి కలలో కూడా చంద్రబాబు గారే గుర్తుకొస్తున్నారు అన్న విషయం ఈ రోజు కేటీఆర్ గారి మాటల్లో బయటపడింది. ఫెడరల్ ఫ్రంట్ అంటూ చక్రం తిప్పి 420 పార్టీతో జత కట్టిన కేసీఆర్ గారు తెలంగాణకే పరిమితమై చతికలపడ్డారు.
ఒక్క నాయకుడిని ఎదుర్కోలేక ముగ్గురు నాయకులు ఒక్కటై ఎన్నో కుట్రలు చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమంలో పోటీ పడలేక, జగన్‌తో చేతులు కలిపి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే భారీ ప్రణాళికలతో తెరాస ముందుకొస్తున్న విషయం ఇవ్వాళ కేటీఆర్ మాటల్లో తేలిపోయింది. తెలుగుదేశం ఓటమి కోసం కృషి చేసే కేసీఆర్ ఆయన సహచరులకు భంగపాటు తప్పదు! ఇది తథ్యం!’’ అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. మరో పక్క, చంద్రబాబు నాయుడులపై కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు కౌంటర్ ఇచ్చారు.
వైసీపీ తరపున కేటీఆర్ వకాల్తా పుచ్చుకున్నారన్న నక్కా తెలంగాణలో ప్రజల సెంటిమెంటును రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన మీరు అభివృద్ధి మీద దృష్టిపెట్టాలని, గత ప్రభుత్వంలో ఇచ్చిన మ్యానిఫెస్టోలో పదిశాతం హామీలను కూడా అమలుచేయలేకపోయారని, దానిపై దృష్టి పెడితే ప్రజలకు మేలన్నారు. టీడీపీ తెలుగువాళ్ళ పార్టీ అయితే తెరాస తెలంగాణ పార్టీ అన్నారు. డబ్బు ఉందన్న అహంకారంతో కేటీఆర్ మాట్లాడుతున్నారని, కుట్రలు జరుగుతున్నాయని కేటీఆర్ వ్యాఖ్యలతోనే అర్ధమైపోతుందని, జగన్ లండన్ టూర్ కూడా కుట్రలో భాగమేనన్నారు.