ఆపరేషన్ కమలతో రాష్ట్ర రాజకీయాలను దిశానిర్దేశం మార్చాలన్న బీజేపీ ఎత్తుగడలకు కాంగ్రెస్ సర్జికల్ స్ట్రైక్ చేసింది. బడ్జెట్‌కు మూడు గంటల ముందే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప, జేడీఎస్ గురుమిట్కల్ ఎమ్మెల్యే నాగనగౌడ కుమారుడు శరణ గౌడతో చేసిన బేరసారాల ఆడియోను విడుదల చేసి కమల దళాన్ని ఖంగు తినేలా చేసింది. కర్నాటక రాజకీయ సంక్షోభం సంచలన మలుపు తీసుకుంటోంది. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ తమ ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగుతోందని ముఖ్యమంత్రి కుమార్ స్వామి ఆరోపించారు. కర్నాటక బీజేపీ చీఫ్, ప్రతిపక్ష నేత బీఎస్ ఎడ్యూరప్ప... జేడీఎస్ ఎమ్మెల్యేతో మాట్లాడినట్టు చెబుతున్న ఓ ఆడియో టేపును ఆయన మీడియాకు విడుదల చేశారు.
సీఎం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ... ‘‘రాత్రి 1:30 సమయంలో నాకు ఈ సమాచారం అందింది. మా పార్టీ ఎమ్మెల్యే అర్థరాత్రి సమయంలో నాకు ఫోన్ చేసి విషయం చెప్పారు. అలాంటి విధేయత గల నాయకుల వల్లే మా పార్టీ ఇంకా రాష్ట్రంలో నిలిచిఉంది. ఎమ్మెల్యే నాగనగౌడ కంద్కూర్ కుమారుడు శరణకు ఎడ్యూరప్ప రూ.25 లక్షలు ఆశచూపారు. దీంతోపాటు ఆయన తండ్రికి మంత్రి పదవి కూడా ఇస్తామని ఆఫర్ చేశారు..’’ అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వాన్ని బలహీనపర్చే ఉద్దేశం లేదని బీజేపీ పదే పదే చెబుతోందనీ.. కానీ తెరవెనుక మాత్రం అందుకు విరుద్ధంగా కుట్రలు పన్నుతోందని సీఎం ఆరోపించారు. ‘‘ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టబోమని బీజేపీ చెబుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం మన రాజకీయ వ్యవస్థ స్థిరంగా ఎలా ఉండాలో పాఠాలు చెబుతారు. కానీ మరోవైపు మీ సన్నిహితుల ద్వారా ఇదే సూత్రాన్ని కాలరాసేలా ప్రోత్సహిస్తారు. మీకు నిజంగా నీతి అనేది ఉంటే.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని డిమాండ్ చేస్తున్నా...’’ అని కుమారస్వామి పేర్కొన్నారు.
సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్న వారెవరో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘ఎమ్మెల్యేల కొనుగోలుపై నేను ఇప్పుడు ఆధారాలు బయటపెడుతున్నాను. దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థను కూల్చేందుకు బీజేపీ ఎలా ప్రయత్నిస్తున్నదో చూసి మీరే న్యాయం చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా..’’ అని కుమారస్వామి పేర్కొన్నారు. మరో పక్క, నలుగురు కాంగ్రెస్ అసంతృప్తులు బీజేపీ చెంతనే ఉన్నట్లు దాదాపు తేలిపోయింది. విప్ జారీలో ఉన్నా సమావేశాలకు గైర్హాజరు అవుతుండడంతో ఆ నలుగురికపైనా ఏకకాలంలో చర్యలకు సీఎల్పీ నిర్ణయం తీసుకుంది. అసంతృప్తులు నలుగురిని ఏకకాలంలో వేటు వేసేలా సర్జికల్ స్ట్రైక్ తరహాలో స్పీకర్‌కు సిఫారసు చేశారు. నలుగురిపై వేటు పడ్డంతో మిగిలిన అసంతృప్తులు అప్రమత్తమయ్యారు.