మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామితో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. భాజపా యేతర పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ మధ్యాహ్నం చంద్రబాబు బెంగళూరు బయల్దేరి వెళ్లారు. తొలుత జేడీఎస్ అగ్రనేత దేవెగౌడ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు బృందానికి దేవెగౌడ, కుమారస్వామి ఘన స్వాగతం పలికారు. జాతీయ స్థాయిలో భాజపాకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలను ఏకం చేయడమే లక్ష్యంగా ఇప్పటికే సీఎం రెండుసార్లు దిల్లీ వెళ్లిన నేపథ్యంలో నేటి తెదేపా, జేడీఎస్ నేతల భేటి ప్రాధాన్యత సంతరించుకుంది.
దేవెగౌడ మాట్లాడుతూ నాలుగేళ్ళ ఎన్డీయే పాలన పెద్ద నోట్ల రద్దు వంటి చాలా సమస్యలను సృష్టించిందన్నారు. మోదీ ప్రభుత్వం వ్యవస్థలపై గురిపెట్టిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ సహా లౌకికవాద పార్టీల నేతలను కలిశారన్నారు. ఈ నేపథ్యంలో తమపై ఓ బాధ్యత ఉందన్నారు. లౌకికవాద పార్టీలన్నీ ఏకతాటిపైకి రావలసిన అవసరం ఉందని తెలిపారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దేవె గౌడ ఆశీర్వాదాలు, మద్దతు కోసం తాను ఇక్కడికి వచ్చానన్నారు. ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను, దేశాన్ని కాపాడాలన్న లక్ష్యంతో బెంగళూరు వచ్చానన్నారు. మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా నమ్మక ద్రోహం చేసిందన్నారు.
కుమార స్వామి మాట్లాడుతూ లౌకికవాద శక్తులను ఏకం చేయడం కోసం తాము చర్చలు జరిపినట్లు తెలిపారు. చంద్రబాబు, దేవె గౌడ రాజకీయ లెక్కలు చాలా బాగున్నాయన్నారు. చంద్రబాబు ఎంట్రీతో సీన్ మారిపోయిందని, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా 1996నాటి పరిస్థితులు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల చంద్రబాబు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాయావతి, శరద్‌పవార్, శరద్ యాదవ్, ములాయం సింగ్‌యాదవ్, అఖిలేశ్ యాదవ్, ఫరూఖ్ అబ్దుల్లా, సీతారాం ఏచూరితో వరుస భేటీలు నిర్వహించి వారందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.