కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలు దేశం మొత్తం చూస్తుంది. గవర్నర్ ను అడ్డు పెట్టుకుని, మోడీ, అమిత్ షా ఎలాంటి రాజకీయం చేస్తున్నారో చూస్తున్నాం.. తాజాగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీయేతర పక్షాలన్నీ ఏకం కావాల్సిన సమయం అసన్నమైందని జేడీఎస్ శాసనసభాపక్ష నేత కుమారస్వామి పిలుపునిచ్చారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో భాజపా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని.. దాన్ని ఎదుర్కొనేందుకు చంద్రబాబునాయుడుతో పాటు, మమతాబెనర్జీ, కేసీఆర్, మాయావతి తమతో కలిసిరావాలని కోరారు. విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నారు. క
ర్ణాటకలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు భాజపా తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని కుమారస్వామి అన్నారు. భాజపా మెజార్టీ లేకపోయినా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడం దారుణమని కుమారస్వామి అన్నారు. గవర్నర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. మరో పక్క కేంద్రం, ఈడీతో దాడులు చేపిస్తుందని, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని, అన్నీ అమిత్ షా దగ్గర ఉండి నడిపిస్తున్నారని, వీళ్ళని ఎదుర్కోవాలి అంటే, అందరూ వస్తేనే కుదురుతుంది అని చెప్పారు.. కర్ణాటకలో అధికారం చేజిక్కని పక్షంలో ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా చర్చకు లేవనెత్తి బీజేపీని డిఫెన్స్‌లోకి నెట్టాలనే యోచనలో జేడీఎస్ ఉన్నట్లు సమాచారం.
మరో పక్క, ప్రముఖ న్యాయనిపుణుడు రాంజెఠ్మలానీ ఈ రోజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానిస్తూ గవర్నర్ వాజుభాయి వాలా తీసుకున్న నిర్ణయాన్ని వ్యక్తిగత హోదాలో ఆయన సవాల్ చేశారు. గవర్నర్ ఆహ్వానం మేరకు బీఎస్ యడ్యూరప్ప ఈ రోజు కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. బలనిరూపణకు ఆయనకు గవర్నర్ 15 రోజుల గడువు ఇవ్వడం కూడా వివాదాస్పదమైంది. అయితే, గవర్నర్ నిర్ణయంపై నిన్న రాత్రే కాంగ్రెస్ సుప్రీంకోర్టు తలుపు తట్టగా, యడ్యూరప్ప ప్రమాణ స్వీకారానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ కేసులో తమ తుది ఆదేశాలకు లోబడి ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారం ఉంటాయని మాత్రం స్పష్టం చేసింది.