తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు తనను గెలిపించిన కుప్పం ప్రజలకు కృతజ్ఞత చెప్పటానికి, ఈ రోజు కుప్పంలో పర్యటించారు. ఈ నేపధ్యంలో, స్థానిక నేతలు, కార్యకర్తలు, ప్రజలు చంద్రబాబుకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, భావోద్వేగానికి గురయ్యారు. కుప్పం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని, ప్రచారానికి రాకపోయినా, ఏడు సార్లు తనను గెలిపించారని, ఇందుకు ఇక్కడ ప్రజలకు కృతజ్ఞత తెలుపుతున్నాని అన్నారు. గత 5 ఏళ్ళ కాలంలో, కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే పనిచేశానని చెప్పారు. తాను ఎక్కడా తప్పులు చేయలేదని, ప్రభుత్వంలో నీతివంతమైన పాలన అందించానని అన్నారు. ఎమ్మెల్యేగా చేసినా, ముఖ్యమంత్రిగా చేసినా, కుప్పం నియోజకవర్గ ప్రజల గౌరవాన్ని పెంచడానికే అనునిత్యం పని చేశానని చంద్రబాబు అన్నారు.
రాష్ట్ర విభజన జరిగిన తరువాతా, కట్టుబట్టలతో అమరావతికి వచ్చిన సమయంలో, అక్కడ కూర్చోడానికి కూడా స్థలంలేకపోయినా, ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిపాలన చేసామని చంద్రబాబు అన్నారు. మన రాష్ట్రానికి, లోటు బడ్జెట్ ఉన్నా, ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా, సంక్షేమ కార్యక్రమాల అమలు చేసామని చెప్పారు. కుప్పం నియోజకవర్గానికి నీళ్లు వచ్చేంతవరకు నేను ప్రయత్నం చేస్తానని చంద్రబాబు అన్నారు. ఎన్నికల ఫలితాల పై సమీక్షలు చేస్తున్నామని, ఏ కారణాల వల్ల ఓడిపోయాం, మనం చేసిన తప్పులు పై విశ్లేషించుకుంటూన్నామని అన్నారు. కొన్ని బూత్‌లలో అర్థం కాకుండా ఫలితాలు వచ్చాయన్నారు. కార్యకర్తల పై దాడులు పెరిగిపోయాయి, వారిని ఆడుకోవాల్సిన బాధ్యత నా పై ఉంది, అందరినీ కాపాడుకుంటా అని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ పేదల కోసం పెట్టిన పార్టీ అని, తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ అని, ఈ పార్టీని కాపాడుకుని, మళ్ళీ ప్రజల ఆశీస్సులతో ముందకు తీసుకువెళ్లాలని చంద్రబాబు అన్నారు.