కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్మిస్తున్న ‘గ్రీన్‌ఫీల్డ్’ విమానాశ్రయం పనులు తుదిదశకు చేరాయి. వచ్చే ఏడాది జనవరి 7న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా దీనిని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ప్రస్తుతం చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 31న ప్రయోగాత్మక పనితీరు(ట్రయిల్ రన్) నిర్వహించనున్నారు. దీనికి అనుగుణంగా విమానం దిగేందుకు, ఎగిరేందుకు రంగం సిద్ధం చేశారు. ట్రయిల్‌రన్‌ను రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ఏపీఏడీసీఎల్ ఎండీ వీరేంద్రసింగ్ త్వరలో పరిశీలించనున్నారు. ఇప్పటికే రన్‌వే, ఆప్రాన్‌లను రంగులతో సుందరంగా తీర్చిద్దారు.
ఓర్వకల్లు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.దేశీయ విమానసేవల్లో భాగంగా ఓర్వకల్లు నుంచి విజయవాడ, చెన్త్నె, బెంగళూరుకు సర్వీసులు తిరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రభుత్వం నాంది పలికింది. రాష్ట్ర రాజధాని అమరావతికి వాయు మార్గంలో చేరుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఏటీసీ కేంద్రం పనులు ముగిసిన తర్వాత డిసెంబరు ఆఖరు లోగా ఓర్వకల్లు నుంచి ఏప్రిల్ నెలలో, విజయవాడ, చెన్నైలకు విమానాలు తిరిగేలా చర్యలు తీసుకుంటున్నారు..
కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి చంద్రబాబు జూన్ 2017లో శంకుస్థాపన చేశారు. ఈ విమానాశ్రయంతో కర్నూలు జిల్లా నుంచి వివిధ నగరాలకు విమానం ద్వారా వెళ్లే వెసులుబాటు ఉంటుందన్నారు. ఓర్వకల్లులో ఏర్పాటు చేస్తోన్న గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం మూడు విభాగాలుగా ఉంటుందని అధికారులు తెలిపారు. మొదటి విభాగంలో ఎనిమిది విమానాలను నిలుపుకొనేందుకు అవకాశం ఉంటుంది. మరో విభాగంలో మూడు విమానాలు, ఇంకో విభాగంలో మరమ్మతులకు గురైన విమానాలు ఆపేందుకు అవకాశం ఉంటుంది. విమాన రాకపోకలు పెరిగాక మరో విభాగం ఏర్పాటు చేయనున్నారు.