కర్నూలు నగరంలో విషాదం చోటుచేసుకుంది. నగర శివారు నంద్యాల చెక్ పోస్టు నుంచి జోహరాపురానికి వెళ్లే రహదారి పక్కన పొలాల్లో మంగళవారం మధ్యాహ్నం బాంబు పేలి ముగ్గురు వ్యక్తులు మరణించారు. మృతులను జంపాల మల్లికార్జున, జంపాల రాజశేఖర్‌, జంపాల శ్రీనివాసులుగా గుర్తించారు. కర్నూలు నగరంలో జంపాల కుటుంబానికి మంచి పేరుంది. జంపాల మల్లికార్జున, జంపాల రాజశేఖర్‌ స్థిరాస్తి వ్యాపారం చేస్తూ స్థానికంగా ఎన్నో భవనాలు నిర్మించారు. ఇటీవల వీరిద్దరూ కర్నూలు నగర శివారులో రూ.20కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి మంగళవారం పొలాన్ని సర్వే చేయించారు. దీని నిమిత్తం వీరికి వరసకు సోదరుడయ్యే ఏఎస్సై జంపాల శ్రీనివాసులు, సర్వే డిపార్ట్‌మెంట్‌ డ్రైవర్‌ సుధాకర్‌ అక్కడికి వచ్చారు.

kurnool 31072018 2

వీరంతా భూమిని సర్వే చేయిస్తున్న సమయంలో కూలీలు చెత్తను ఓ చోటికి పోగుచేసి నిప్పు పెట్టారు. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మల్లికార్జున, రాజశేఖర్‌ అక్కడికక్కడే మృతిచెందారు. శ్రీనివాసులు, సుధాకర్‌ తీవ్రంగా గాయపడటంతో హుటాహుటిన కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ శ్రీనివాసులు మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న జంపాల కుటుంబసభ్యులు, బంధువులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. ఒకే ప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు మృతిచెందడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన కర్నూలు నగరంలో కలకలం రేపింది.

kurnool 31072018 3

జంపాల కుటుంబీకులకు ఎవరితోనూ శత్రుత్వం లేదని.. అందరితోనూ మంచిగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి మృతులకు కుటుంబసభ్యులను పరామర్శించారు. కర్నూలు డీఎస్పీ యుగంధర్‌బాబు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆ ప్రాంతంలోకి బాంబు ఎలా వచ్చిందన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఎవరైనా అక్కడ బాంబులను దాచారా? లేక ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read