కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలానికి మహర్దశ పట్టనుంది. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు కీలకమైన ఓర్వకల్ లో సుమారు 1,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించేందుకు సుమారు 100 మందికి పైగా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ముందుగా కర్నూలుకు తలమానికంగా మారిన జైరాజ్ ఇస్సాత్ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూమి పూజ చేయనున్నారు. రూ. 3వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ స్టీల్ ఫ్యాక్టరీలో దాదాప 1,100 మందికి ప్రత్యక్షంగా, మరో 2 వేల మందికి పైగా పరోక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. ఈ పరిశ్రమకు అనుబంధంగా మరి కొన్ని పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు కానున్నాయి. నంద్యాలలో రూ. 60 కోట్ల పెట్టబడితో ఏర్పాటు కానున్న ఆత్యాధునిక ఉదయానంద ప్రైవేట్ ఆసుపత్రి ఏర్పాటు కానుంది.
అంతే కాకుండా కొమ్ము చెరువు ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో రూ.30 కోట్లతో పుట్టు గొడుగుల పరిశ్రమ ఏర్పాటు కానుంది. కర్నూలు జిల్లా ఉల్లిగడ్డ పంటకు ప్రసిద్ది. ప్రతి ఏటా అతివృష్టి, అనావృష్టితో పాటు గిట్టుబాటు ధరలు లేక ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయాన్ని గమనించిన ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో 30 కోట్లతో భారత్ ఉల్లిగడ్డల కోల్డ్ స్టోరేజి గోదాము నిర్మాణానికి అనుమతిచ్చారు. ఉల్లిగడ్డలు ధరలు లేని సమయంలో ఇక్కడ నిల్వ ఉంచుకొని గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత విక్రయించుకునేందుకు వీలుగా ఈ కోల్డ్ స్టోరేజి రైతులుకు బాగా ఉపయోగ పడనుంది. పోలిశెట్టి కంజల్స్ పేరుతో డాక్టర్ రవిబాబు అనే పారిశ్రామికవేత్త రూ. 5.5 కోట్లతో మినరల్ సోడియం సెల్ఫ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు కానుంది.
స్వదేశీ, విదేశీ పెట్టుబడులకు స్వర్గధామంగా కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం మారనుంది. ఇక్కడ 34 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రాంతంలో దేశంలోనే రెండవ అతి పెద్ద పవర్ గ్రిడ్ ఓర్వకల్ సమీపంలోనే ఉంది. దేశంలోనే పెద్ద పవర్ గ్రిడ్ రాయచూర్లో ఉండగా, రెండవ అతి పెద్ద పవర్ గ్రిడ్ ఇక్కడ ఉండడం విశేషం. అంతేకాకుండా అతీ ప్రపంచంలోనే పెద్ద సోలార్ ప్రాజెక్టు కూడా ఇక్కడే ఉంది. ఈ ప్రాంతం నుంచి అటు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, అమరావతి వంటి మహానగరాలు సమాన దూరంలోనే ఉన్నాయి. ఇక్కడ విదేశీ పెట్టుబడులను ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలోనే విమానాశ్రయం పనులు వేగంగా జరుగుతోంది. సుమారు 1500 ఎకరాల్లో విమానాశ్రయం ఏర్పాటు కానుంది. ఇదే ప్రాంతంలోనే మెడికల్ హబ్గా మార్చేందుకు కూడా స్థల సేకరణ జరుగుతోంది. ఆరవిందో,హెట్రో వంటి ఔషధ కంపెనీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రముఖ సీడ్ కంపెనీలు కూడా ఇక్కడ నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి.
పరిశ్రమలను ఆకర్షించాలంటే అందుకు కనీస మౌలిక సదుపాయాలు అవసరమవుతాయి. ఇందుకు ఈ ప్రాంతంలో నీటి సౌకర్యం, రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయల కోసం ఎపిఐఐసి రూ. 500 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాంతానికి చేరువలోనే తుంగభద్ర, కృష్ణా నది ఉండడంతో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, మల్యాల ఎత్తిపోతల పథకం ఉండడం, హంద్రీ-నీవా కాలువ ఉండడంతో నీటి సౌకర్యానికి ఇబ్బందులు లేవు. నేరుగా కాల్వల ద్వారా నీటి సదుపాయాలను పొందే అవకాశాలు ఉన్నాయి. 100 మంది పారిశ్రామికవేత్తలతో నేడు సీఎం ఒప్పందాలు... పది కోట్ల లోపు పెట్టుబడులు పెట్టగలిగే పారిశ్రామికవేత్తలతో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. వీరితో చర్చించి పెట్టుబడులు పెట్టుకునేందుకు అవసరమైన అన్ని సాంకేతిక సమస్యలన్నీ వెంటనే పరిష్కారం చేసేందుకు ఈ సమావేశం కీలకంగా మారింది.