రాజధాని అమరావతి నిర్మాణం ప్రపంచానికే తలమానికం కానుందని.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తోందని సందర్శకులు కొనియాడారు. రాజధాని అమరావతి సందర్శనకు ఏపీ సీఆర్‌డీఏ శ్రీకారం చుట్టింది. శుక్రవారం కర్నూలు జిల్లా సంజామల మండలం, విజయనగరం జిల్లా కురుపాం మండలం, చిత్తూరు జిల్లా శాంతిపురం, రామకుప్పం మండలం, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలాల నుంచి ప్రజలు బస్సుల్లో అమరావతి సందర్శనకు తరలి వచ్చారు. వారు తొలుత రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఉద్దండ్రాయునిపాలెం సందర్శించారు
అనంతరం సీడ్‌యాక్సెస్ రహదారి మీదుగా మందడం వెళ్లి అక్కడ పేదలకు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద నిర్మిస్తున్న భవనాలు తిలకించారు. ఆపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస భవనాలు, తాత్కాలిక హైకోర్టును సందర్శించారు. తదుపరి తాత్కాలిక సచివాలయ భవనాలు, విట్(ఏపీ)విశ్వవిద్యాలయం చూశారు. ఆ తర్వాత విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లారు. ఏపీ సీఆర్‌డీఏ ఓఎస్‌డీ అన్నే సుధీర్‌బాబు రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. అయితే అమరావతిలో ఇంత పని జరుగుతుందనే విషయం తెలియదని, వార్తల్లో ఇవన్నీ చూపించటం లేదని, ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్ లు, ఇక్కడే జరిగే పనులు చూస్తుంటే చంద్రబాబు చెప్పే మాటలు నిజమే అనే నమ్ముతున్నామని అన్నారు.
మా ఊరికి వెళ్లి, అందరినీ అమరావతి చూసి రమ్మని చెప్తామని అంటున్నారు. కొన్ని పార్టీలు అసలు అక్కడ ఏమి లేవు, భ్రమరావతి, గ్రాఫిక్స్ అంటుంటే, చంద్రబాబు ప్రజలను అక్కడకు తీసుకువెళ్ళి అక్కడ జరుగుతుంది చూపిస్తున్నారని అంటున్నారు. పోలవరం యాత్ర లాగే, అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి, ప్రజలకు చూపించంటానికి, అద్భుతమైన రాజధాని నిర్మాణంలో ప్రజలను భాగస్వామ్యం చెయ్యటానికి, అమరావతి యాత్ర కూడా మొదలు పెట్టారు. ఈనెల 27 నుండి, ప్రతిరోజు ఒక మండలం చొప్పున, అన్ని జిల్లాల నుంచి, అమరావతి సందర్శన యాత్రకు ఉచిత బస్సులు పెట్టారు. ముఖ్యంగా, సీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు, అమరావతిలో భాగస్వామ్యం చేస్తూ, వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.