అమరావతి బాండ్లపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఈర్ష్యతోనే అసత్యప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆరోపించారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2009లో టీడీపీ ప్రచురించిన ‘రాజా ఆఫ్ కరప్షన్’ పుస్తకంపై ఉండవల్లి బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. అమరావతి టాక్స్ ఫ్రీ బాండ్లు కావని స్పష్టంచేశారు. గంటలోపే రూ 2వేల కోట్ల మేర అమరావతి బాండ్లు జారీ అయినప్పటి నుంచి ప్రతిపక్షాలు అక్కసు వెళ్లబోసు కుంటున్నాయని మండిపడ్డారు. తాము ఇచ్చే వడ్డీరేటు కంటే ఎవరు తక్కువ ఇచ్చినా ఎరేంజ్డ్ ఫీజు చెల్లిస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వాలు చేసిన అప్పులపై 75 శాతం వడ్డీ చెల్లించటం వల్లే ఆర్థిక భారం పెరిగిందన్నారు. ఆర్థిక అంశాలపై ప్రజలకు అవగాహన ఉండదనే భావనతో పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. సెబీ కింద గుర్తింపు పొందిన సంస్థలు కూడా బిడ్‌లో కోట్ చేశాయని, పారదర్శకంగా బిడ్డింగ్ నిర్వహించామన్నారు.
యూసీలు ఏ విధంగా ఇస్తారో ఉండవల్లికి తెలియనిది కాదన్నారు. కేంద్రం సహకరించకపోయినా పనులకు అంతరాయం కలుగకూడదనే ఉద్దేశ్యంతో అమరావతి బాండ్లను విక్రయానికి పెట్టామన్నారు. ఉపాధి హామీ పథకం పనుల్లో పురోగతికి 10 జాతీయ అవార్డులు లభించాయని పారదర్శకతకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. ఉండవల్లి చిల్లర ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ 7 రెట్లు పెంచాలని అప్పడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నిర్ణయించారని, విభజన తరువాత ఏపీలో ప్రస్తుతం 14 రెట్లు జీఎస్డీపీ పెరిగిందని దీన్ని అవహేళన చేయటం రాజకీయ దురుద్దేశ్యంతోనే అన్నారు. మరో మూడేళ్లలో సీఆర్డీఏ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని ఈ విషయం తెలిసే ఇనె్వస్టర్లు అమరావతి బాండ్లపై ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.
2004లో స్విట్జర్లాండ్ మంత్రి సీఎం చంద్రబాబునాయుడుపై విమర్శలు చేశారని ఉండవల్లి చెప్పారని, ఆనాడు చంద్రబాబునాయుడు ‘విజన్ 2020’ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారని చెప్పుకొచ్చారు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రూ.లక్షా 9 వేల కోట్లు జి.ఎస్.డి.పి.గా ఉందని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల జి.ఎస్.డి.పి. రూ.13.6 లక్షల కోట్లకు చేరుకుందని చెప్పారు. ఆనాడు సీఎం చంద్రబాబునాయుడు ఏడు రెట్లు పెంచుదామని అంటే, నేడు జి.ఎస్.డి.పి. 14 రెట్లు పెరిగిందని, ఇది చంద్రబాబు విజన్ కు నిదర్శనమని, దీన్ని కూడా విమర్శిస్తూ ఉండవల్లి హేళనగా మాట్లాడడం సబబు కాదని హితవు పలికారు. మరో రెండు మూడేళ్లలో సీఆర్డీయే ఆదాయం విపరీతంగా పెరుగుతుందని, ఈ విషయం గుర్తించే ఇన్వెస్టర్లు అమరావతి బాండ్ల కొనుగోలుకు ఆసక్తి చూపారని కుటుంబరావు చెప్పారు.