రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మరోసారి బీజేపీ చేస్తున్న అబద్ధపు ప్రచారం పై, ముఖ్యంగా జీవీఎల్ చేస్తున్న తప్పుడు ప్రచారం పై ఫైర్ అయ్యారు. దేశంలో తొలి 10 స్థానాల్లో ఉండే నేరగాళ్లు, రాజకీయ అబద్ధాలకోరు ఎవరని గూగుల్‌లో వెతికితే ప్రధాని నరేంద్రమోదీ పేరు వస్తోందని కుటుంబరావు వ్యాఖ్యానించారు. హిందూత్వాన్ని అడ్డం పెట్టుకుని పట్టణ ఉగ్రవాదం మొదలుపెట్టిందెవరో ప్రజలందరికీ తెలుసన్నారు. రాష్ట్రంలో బీజేపీ వాళ్లను చూసి వీధి కుక్కలు కూడా అసహ్యించుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలకు వారి కుటుంబ సభ్యులు కూడా ఓటు వేయరన్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ ట్విట్టర్‌లో యాక్టీవ్‌గా ఉంటారని, ఆయన ట్వీట్లపై వచ్చే స్పందన ఒక్కసారి పరిశీలించుకుంటే అతని స్థాయి ఏంటో తెలుస్తుందన్నారు. ‘కనకదుర్గ గుడి దగ్గర అడుక్కోవడానికి కూడా జీవీఎల్ పనికిరాడు. పనికిమాలిన వెదవలను రాష్ట్రంలోకి రానివ్వడమే ఎక్కువ’ అని కుంటుంబరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపై తెచ్చేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తుంటే.. ప్రజల డబ్బులు వృధా చేస్తున్నట్లు కనిపిస్తుందా? అని ఫైర్ అయ్యారు.
‘‘రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలకు సీఎం చంద్రబాబునాయుడు జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తుంటే భాజపాకు వృథా ఖర్చులా కనిపిస్తోంది. 2012 నుంచి ప్రధానిగా పగ్గాలు చేపట్టే వరకూ నరేంద్రమోదీ దేశం మొత్తం విమానంలో పర్యటించారు. ఆ ఖర్చులు గుజరాత్ ప్రభుత్వం భరించిందా? లేక భాజపానా? గుజరాత్ ప్రభుత్వ ఖర్చులతోనే దేశమంతా తిరిగి, రాష్ట్ర ప్రయోజనాల కోసమని పద్దుల్లో రాశారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ నా వద్ద ఉన్నాయి. ఇటీవల భాజపా రాష్ట్ర కార్యాలయ శంకుస్థాపనకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎలా వచ్చారు? రక్షణ శాఖ విమానంలో కాదా? భాజపా పాలిత రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో దేశమంతా చూస్తోంది. దీనిపై భాజపా నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా? లాటరీ గెలుచుకున్నట్లుగా వచ్చిన ఎంపీ పదవిని అడ్డంపెట్టుకుని జీవీఎల్ నరసింహరావు నోటికొచ్చినట్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు’’ అని పేర్కొన్నారు.
‘‘ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు 59 నిమిషాల్లోనే రూ.కోటి రుణం ఇస్తామని ప్రధాని మోదీ ఆర్భాటంగా చెప్పారు. ఇందుకోసం పీఎస్‌బీ లోన్స్ ఇన్ 59 వెబ్‌సైట్ కూడా ప్రారంభించారు. దీని కింద రాష్ట్రంలో ఎంత మందికి రుణాలిచ్చారో చెప్పగలరా? పీఎస్‌బీ లోన్స్‌ను క్యాపిటా వరల్డ్ సంస్థకు ఇచ్చారు. అవి కూడా షా పేరుతో ఉన్న వారివే. ఇంతకంటే పెద్ద కుంభకోణం ఉంటుందా? రుణాల కోసం లక్షల దరఖాస్తులు వస్తే ఆ ఒక్క సంస్థకే పెద్ద మొత్తంలో రుణాలేలా ఇస్తారు? ఇది ఆర్థిక ఉగ్రవాదం కాదా? దీనిపై లోతైన దర్యాప్తు జరపాలి...’’ అని కుటుంబరావు పేర్కొన్నారు.