కేవీపీ రామచంద్రరావు. ఇప్పటి రాజకీయాలు దగ్గరగా చూస్తున్న యువతరానికి ఈయన గురించి పెద్దగా తెలియక పోవచ్చు కానీ, రాజశేఖర్ రెడ్డి పరిపాలన సమయంలో, కేవీపీ అంటే తెలవని వారే ఉండరు. రాజశేఖర్ రెడ్డి ఆత్మగా కేవీపీకి పేరు ఉంది. అంటే రాజశేఖర్ రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయంలో, కేవీపీ బుర్ర ఉండేదని చెప్తారు. రాజశేఖర్ రెడ్డికి ఇంత దగ్గరగా ఉండే కేవీపీ, తరువాత జరిగిన పరిణామాలతో జగన్ వైపు చేరలేదు. కష్టమైనా, నష్టమైనా కాంగ్రెస్ తోనే ఉండి పోయారు. అప్పట్లో జగన్ బెయిల్ రావటానికి కారణం, కేవీపీ లాబీ అనే ప్రచారం కూడా జరిగింది. అయితే తరువాత నుంచి కేవీపీ, ఎప్పుడు జగన్ ని కలిసింది లేదు. ఇద్దరి మధ్య లోపల సంబంధాలు ఎలా ఉన్నాయో కానీ, బయటకు మాత్రం సంబంధాలు లేవు. చాలా తక్కువగా మాట్లాడే కేవీపీ, ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో, నేటి రాజకీయాల గురించి పంచుకున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి పై వస్తున్న విమర్శల పై ఆయన్ను అడగగా, తనకి జగన్ కి మధ్య పెద్దగ సంబంధాలు లేవని, నేను కూడా వార్తల్లో వస్తున్న విషయాలు, వాళ్ళు వీళ్ళు చెప్తున్న విషయాలు చూసే చెప్తున్నా అని, అందరి సలహాలు తీసుకోకుండా, ఎవరి అభిప్రాయాలు పట్టించుకోకుండా, సీనియర్ల సలహాలు తీసుకోకుండా పాలన జరుగుతున్నట్టు అనిపిస్తుందని అన్నారు.
గతంలో రాజశేఖర్ రెడ్డి దూకుడుగా ఎవరి మాట వినకుండా ఉండేవారని, అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం, అందరినీ కలుపుకుని వెళ్ళే వారని, అందరి అభిప్రాయాలూ తెలుసుకుని ముందుకు వెళ్ళే వారని అన్నారు. అంటే పరోక్షంగా జగన్ ఎవరినీ కలుపుకుని వెళ్ళటం లేదని, అందరినీ కలుపుకుని, అందరి సలహాలు పరిగణలోకి తీసుకోవాలని సలహా పరోక్షంగా ఇచ్చారు. ఇక జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారా అని ప్రశ్నించగా, మూడేళ్ళ ముందే చెప్తే దాన్ని విశ్లేషణ అనరు అని, జోతిష్యం అంటారని, తనకు జోతిష్యం రాదని అన్నారు. ఎన్నికల ముందు వరకు ఏమైనా జరగవచ్చు అని అన్నారు. ఇక్కడ కూడా పరోక్షంగానే సమాధానం చెప్పారు. జగన మళ్ళీ వస్తాడు అనే కాన్ఫిడెన్స్ ఆయన మాటల్లో కనిపిచలేదు కాబట్టే, ఎన్నికల ముందు వరకు ఏమి చెప్పలేం అని అన్నారు. జగన్ వైఖరి గురించి ప్రశ్నించగా, మాటలు దాట వేసారు. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పై చెప్తూ, ఏపిలో బలం పుంజుకుంటామని, తెలంగాణాలో అధికారంలోకి వస్తామని అన్నారు.