మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురంలో బుధవారం నిర్వహించిన ఇళ్ళపట్టాల పంపిణీ రసాభసగా మారింది. వేదికపై టీడీపీకి చెందిన ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, వైకాపా నియోజకవర్గ ఇన్‌చార్జ్ తోట త్రిమూర్తులు మధ్య వాగ్వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యేను మాట్లాడవద్దని మైక్ కట్ చేయడంతో ఆయన అదే సభావేదికపై బైఠాయించి తన నిరసనను తెలిపారు. అయినప్పటికీ టిడిపి ఎమ్మెల్యేను పట్టించుకోకుండా మొత్తం కార్యక్రమాన్ని తోట నిర్వహించారు. ఇదే వేదికపై వైకాపా రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇది దుమారాన్ని రేపింది. తోట త్రిమూర్తులు ఒకరిని ఉద్దేశించి అనాలని ఒక వ్యవస్థ పై విమర్శలు చేయడం తగదని సూచించడంతో పాపారాయుడు వెనక్కి తగ్గారు. అదే సభాప్రాంగణంలో ఉన్న మండపేట రూరల్ సీఐ కే.మంగాదేవీ పాపారాయుడు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పోలీసు వ్యవస్థపట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని తనదైన శైలిలో కౌంటర్ ఫైర్ అయ్యారు. కపిలేశ్వరపురంలో బుధ వారం ఇళ్ళపట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగినా ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే వేగుళ్ళకు ఆహ్వానం వస్తుండడంతో ఆయన ఆయా సభలకు హాజరవుతూ ఉన్నారు. ఒకటి రెండు చోట్ల వైకాపా, టీడీపీల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంటూనే ఉంది. ఈ క్రమంలో కపిలేశ్వరపురం సభలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా ఇతర విషయాలు ఈ వేదికపై ఎందుకు మాట్లాడుతున్నారంటూ వైకాపా ఇన్ చార్జ్ తోట త్రిమూర్తులు ప్రశ్నించారు.
దీంతో వారిద్దరి మధ్య వాగ్వి వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేను మాట్లాడనివ్వబోమని వైకా పా కార్యకర్తలు కేకలు వేయడంతో ఎమ్మెల్యే అదే వేదికవద్ద కింద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ దశలో పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగించారు. ఇదిలా ఉండగా ఇదే సమయంలో తొలుత ప్రసంగించిన వైకాపా రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పోలీసులు కుక్కల్లా వ్యవహరించారని తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు. ఆనాడు తన కుమార్తె వివాహ సందర్భంలో ఎమ్మెల్యే వేగుళ్ళ రెడ్డి సామాజికవర్గానికి చెందిన తనపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేసారన్నారు. తన తల్లిని సైతం మానసిక క్షోభకు గురిచేసిన సందర్భాన్ని గుర్తుచేస్తూ అప్పటి రూరల్ ఎస్ఎ సిహెచ్.విద్యాసాగర్(గబ్బర్ సింగ్) అంటూ సంబోధిస్తూ అధికారతొత్తుగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ నేపధ్యంలో అక్కడే ఉన్న సీఐ కే.మంగాదేవీ పోలీసు వ్యవస్థను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ, వైసిపీ నేతలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. వ్యవస్థను అనడం సరికాదని పేర్కొన్నారు. తాము యునిఫారం వేసుకుని, చట్టాల ప్రకారమే పని చేస్తాం అని, మీ ఇష్టం వచ్చినట్టు మాటలు పాడటానికి, మేము సిద్ధంగా లేమని అన్నారు. అనంతరం తాను అనుభవించిన ఇబ్బందుల మేరకు అలా అన్నానని ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానంటూ పాపారాయుడు సభాముఖంగా స్పష్టంచేసారు.