తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలకు సంబంధించిన సర్వేలంటే అందరి కంటే ముందు గుర్తొచ్చేది మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో లగడపాటి సర్వేలకు విశేష ఆదరణ ఉండేది. బెట్టింగ్ రాయుళ్లు లగడపాటి సర్వేను ఆధారంగా చేసుకుని వందల కోట్లు బెట్టింగ్ పెట్టేవారు. ఎన్నికల ఫలితాల కాలజ్ఞానిగా లగడపాటిని చాలామంది విశ్వసించేవారు. అయితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విషయంలో లగడపాటి అంచనాలు బొక్కబోర్లాపడటంతో ఆయన సర్వే పట్ల విశ్వసనీయత తగ్గింది. అయినప్పటికీ.. ఏపీ ఎన్నికల ఫలితాలపై లగడపాటి సర్వే ఏం చెప్పబోతోందన్న ఆసక్తి రాజకీయ వర్గాలతో పాటు, ఇటు సామాన్య జనంలోనూ నెలకొంది.
అయితే.. ఫలితాలు వెల్లడించే రోజు సమీపిస్తున్న కొద్దీ పోటీ చేసిన అభ్యర్థులతో పాటు ఓటేసిన ప్రజల్లో కూడా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మరో 9 రోజుల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఎన్‌ఆర్‌ఐలు కూడా ఫలితాలపై అత్యంత ఆసక్తి కనబరుస్తుండటం విశేషం. ఊర్లలో ఉన్న తమవారికి ఫోన్ చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటున్నారు. అయితే.. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న లగడపాటికి సరికొత్త అనుభవం ఎదురైందట. గతంలో పలుమార్లు అమెరికా వెళ్లినప్పటికీ ఇప్పుడు దక్కినంత ఘన స్వాగతం లగడపాటికి ఎన్నడూ దక్కలేదట. ఈ వింత అనుభవం చూసి, లగడపాటికి కూడా షాక్ అయ్యారు. లగడపాటికి ఆతిథ్యం ఇచ్చేందుకు తెలుగు ఎన్‌ఆర్ఐలు పోటీ పడుతున్నారట. అందుకు కారణమేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లగడపాటి సర్వేలో ఏపీ ఫలితం గురించి ఏం తేలిందనే విషయం తెలుసుకునేందుకు ఎన్‌ఆర్‌ఐలు తీవ్ర ఆసక్తి కనబరుస్తున్నారట.
లగడపాటిని కలిసిన తెలుగు ఎన్‌ఆర్ఐలు అడుగుతున్న తొలి ప్రశ్న.. ఏపీ ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతుందనేనట. ఈ ప్రశ్నకు లగడపాటి సమాధానం చెప్పకపోయినప్పటికీ.. ఎన్‌ఆర్‌ఐలకు లీకులిస్తున్నారట. అభివృద్ధి, సంక్షేమంకు మద్దతుగానే ఏపీ ప్రజలు ఓటు వేశారని ఆయన సమాధానమిచ్చారట. కొన్ని చోట్ల టీడీపీ, మరికొన్ని చోట్ల వైసీపీ హవా సాగుతుందని చెప్పారట. జనసేనకు ఎవరూ ఊహించని విధంగా ఓట్లు పడతాయని లగడపాటి వ్యాఖ్యానించారట. ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించే మే 19నే తన సర్వే ఫలితాలను కూడా వెల్లడిస్తానని లగడపాటి స్పష్టం చేసినట్లు తెలిసింది. ఎన్‌ఆర్‌ఐలు మూడు ప్రధాన వర్గాలుగా విడిపోయి మూడు ప్రధాన పార్టీలకు మద్దతుగా నిలిచారని, వారి పార్టీల ప్రభావం ఎలా ఉందనే విషయం తెలుసుకోవాలని ఆసక్తి కనబర్చారని లగడపాటి చెప్పారు.