లగడపాటి రాజగోపాల్.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నికలొచ్చాయంటే.. లగడపాటి సర్వే వివరాల కోసం తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు పూర్తి కావటం, నేషనల్ మీడియా మొత్తం తెరాస గెలుస్తుంది అనటంతో, అందరూ రాజగోపాల్ సర్వేలో ఏం చెప్పబోతున్నారా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతగా ఉత్కంఠగా మారిన ఎన్నికల పై లగడపాటి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. . 72 నుంచి 75 శాతం వరకు పోలింగ్ జరిగిందన్నారు. రాత్రి 9గంటలకు కచ్చితమయిన పోలింగ్ శాతం ఎంతనేది ఈసీ ప్రకటిస్తుందన్నారు.
అయితే 2014 ఎన్నికల నాటి కంటే అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదయింది. ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు పెరిగిపోయిందన్నారు. ప్రేమ, కసి, జాలి, ఆశ.. ఇవన్నీ తెలంగాణ ప్రజల్లో కనిపించాయన్నారు. 2014 ఎన్నికల్లో పోలయిన 68.5శాతం కంటే ఎక్కువగా ఓటింగ్ ఉంటే ఒకలా.. అంతకు మించి ఉంటే మరోలా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇండిపెండెంట్లు ఎక్కువ సంఖ్యలో గెలుస్తారని గతంలో చెప్పాననీ, ఇదే మాట నిజమవబోతోందన్నారు. 5-7 మంది ఇండిపెండెంట్లు గెలుస్తారని తెలిపారు. టీడీపీ పోటీ చేస్తున్న 13 స్థానాల్లో ఇద్దరు ఇండిపెండెంట్లు గెలుస్తారు.
టీడీపీ వర్సెస్ టీఆర్ఎస్ పోటీ ఉన్నవి 10 మాత్రమేనని, ఇంకో స్థానంలో ఎంఐఎంతో పోటీ ఉంది. 7 సీట్లు ప్లస్ ఆర్ మైనస్ 2గా అటు ఫలితాలు వస్తాయన్నారు. కాంగ్రెస్ కూటమి ఈ ఎన్నికల్లో 65 స్థానాలకు 10 సీట్లు అటు ఇటుగా వస్తాయన్నారు. టీఆర్ఎస్ 35 సీట్లు 10 స్థానాలు అటు ఇటుగా వస్తుందని తెలిపారు. ఎంఐఎంకు 6 నుంచి 7 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి. బీఎల్ఎఫ్ ఒక చోట గెలుస్తుంది. న్యూస్ ఎక్స్ సర్వే ప్రకారం తెలంగాణలో హంగ్ ఏర్పడనుంది. తెలంగాణలో మొత్తం 119 స్థానాల్లో ఎన్నికలు జరగ్గా.. టీఆర్‌ఎస్ 57 స్థానాల్లో, ప్రజాకూటమి 46 సీట్లలో, బీజేపీ 6, ఇతరులు 10 చోట్ల గెలవనున్నారని న్యూస్ ఎక్స్ తెలిపింది. పోటా పోటీ వాతావరణంలో ఎన్నికలు జరిగాయని సర్వే చెబుతోంది. మరో పక్క టైమ్స్ నౌ, రిపబ్లిక్ టీవీలు మాత్రం తెరాస గెలుస్తుందని చెప్పారు.