ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్... రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించి 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేనేలేరు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎందరో ప్రముఖులు ఆయనను సంప్రదిస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన అనేకమంది అగ్ర నాయకులు, అభ్యర్థులు లగడపాటికి ఫోన్ చేస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులూ ఆయనను ఆశ్రయిస్తున్నారు. కొందరు వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, మీడియా సంస్థల వారు కూడా లగడపాటితో మాట్లాడేందుకు తహతహలాడుతున్నారు. కారణం... సర్వే నిపుణుడిగా, ఆంధ్రా అక్టోప్‌సగా ఆయన సంపాదించుకున్న పేరు ప్రతిష్ఠలు, విశ్వసనీయత!
అయితే తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలవబోతున్నారని లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. రెబెల్స్‌గా బరిలోకి దిగిన వీరు సుమారు 8 నుంచి 10 స్థానాల్లో విజయం సాధిస్తారని అన్నారు. తిరుమల వచ్చిన సందర్భంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఫలితాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొందని చెప్పారు. తన సర్వే ఫలితాలను డిసెంబర్ 7న వెల్లడిస్తానని తెలిపారు. అంతకుముందే తెలంగాణలో గెలవబోయే స్వతంత్ర అభ్యర్థుల పేర్లను రోజుకు రెండు చొప్పున చెబుతానన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో నారాయణపేట నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి శివకుమార్ రెడ్డి, ఆదిలాబాద్ బోథ్ (ఎస్టీ) నియోజకవర్గం నుంచి జాదవ్ అనిల్ కుమార్ గెలవబోతున్నారని తెలిపారు.
దీన్నిబట్టి వారికి ఏమేరకు ప్రజాబలం ఉందో అర్థమవుతోందన్నారు. తెలంగాణ ప్రజలు తొలిసారి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కానని పునరుద్ఘాటించారు. గతంలో ఆయన సర్వేలన్నీ నూటికి నూరుపాళ్లు నిజం కావడంతో... ఆయన నుంచి సమాచారం తెలుసుకునేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందా, లేదా తెలుసుకోవాలని ప్రధాన పార్టీల అగ్ర నాయకులు ఆయనను సంప్రదిస్తున్నారు. వ్యక్తిగతంగా తాము విజయం సాధిస్తామా, లేదా సర్వే చేసి పెట్టాలని పలువురు అభ్యర్థులు అడుగుతున్నారు. వ్యక్తిగతంగా ఒక్కో అభ్యర్థి గెలుపోటములపై సర్వే చేయబోమని, రాష్ట్ర స్థాయిలో మొత్తం ఫలితంపైనే తన సర్వే ఉంటుందని లగడపాటి చెబుతున్నారు. సర్వే ఫలితాలను డిసెంబరు 7న పోలింగ్ ముగియగానే సాయంత్రం 5 గంటలకు వెల్లడిస్తానని ఆయన తెలిపారు.