ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన సర్వే అంచనాలను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల రీత్యా రాష్ట్ర ప్రజలు మరోసారి తెదేపా వైపే మొగ్గుచూపినట్టు తమ సర్వేలో తేలినట్టు వెల్లడించారు. పవన్ రాకతో ఈసారి ఏపీలో త్రిముఖ పోరు నెలకొందన్న ఆయన.. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మరోసారి తెదేపా అధికారంలోకి రావాలని అక్కడి ప్రజలు భావించారని విశ్లేషించారు. అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లగడపాటి చెప్పిన అంచనాలు తలకిందులైన విషయాన్ని విలేకర్లు ప్రస్తావించగా.. ఈ నెల 23 తర్వాత తన విశ్వసనీయత పెరుగుతుందని ధీమా వ్యక్తంచేశారు.
ఇదే కాదు, ఏకంగా తన సర్వే పై సంచలన ప్రకటన చేసారు. ఈ సారి తన సర్వే అంచనాలు తప్పితే మళ్లీ సర్వే చేసి చెప్పనని లగడపాటి స్పష్టంచేశారు. ‘‘జనవరి నుంచి ఎన్నికల పోలింగ్ జరిగిన తర్వాత కూడా ఇంచుమించు 110 నుంచి 120 స్థానాల వరకు వివిధ దశల్లో ప్రజల నాడి తెలుసుకుంటూ వచ్చాం. మహిళలు, మగవాళ్లు, యువకులు ఓటు ఎటువేశారనేది అంచనాలు వేసి శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషించాం. సుమారు 1200 సాంపిల్స్ చేస్తే పారదర్శకంగా ఉంటుందని, ఫలితాలకు దగ్గరగా ఉంటాయన్న ఉద్దేశంతో చేశాం. ఏపీలో 13 జిల్లాల్లో ఈ నాలుగైదు నెలల్లో సుమారు లక్షా 50వేల మందిని సర్వేచేసి నాడి పసిగట్టాం." అని అన్నారు.
తెలంగాణలో అంచనాలు ఎందుకు ఫెయిలయ్యాయి? ‘‘ఈ ఫలితాలు వచ్చిన రోజు నా సర్వేను బేరీజు వేసుకున్నాక చెప్తా. నాపై విశ్వసనీయత పెరుగుతుంది. ఈ ఫలితాలపై లోతుగా అధ్యయనం చేశాం. అనేక జాగ్రత్తలు తీసుకున్నాం. మా అంచనాలకు ఏమాత్రం తేడా లేకుండా లోతైన అధ్యయనం చేశాం. 15ఏళ్ల నుంచి సర్వే చేస్తున్నాం. తెలంగాణ విషయంలో ఒకేసారి ఎందుకు తప్పింది? ఎందుకు తేడా వచ్చిందనేది ఆ రోజు తెలియజేస్తా. నేను ఈ రోజు చెప్పిందే వాస్తవం. నా పేరుతో ఏవైనా సర్వేలు సర్క్యులేట్ అయితే నాకు సంబంధంలేదు. నేను నేరుగా మీడియా ముందుకు వచ్చి చెబితేనే అదినేను చెప్పినట్టు. మీడియాలో కథనాలు రాసినా, సోషల్‌మీడియాలో వచ్చినా నమ్మొద్దు. నా వాయిస్ లేకపోతే నాకు సంబంధించింది కాదు. " అని లగడపాటి చెప్పుకొచ్చారు.