ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారు అనే విషయం పై రోజు రోజుకీ టెన్షన్ పెరిగి పోతుంది. ఎవరి ధీమా వారు చెప్తున్నారు. అయితే మే 19 వరకు సర్వే ఫలితాలు ప్రకటించకూడదు అనే నిభందనలు ఉండటంతో, సర్వేలు కూడా బయటకు రాని పరిస్థితి. అయితే, ఆంధ్ర ఆక్టోపస్ గా పేరున్న లగడపాటి, తెలంగాణాలో ఫెయిల్ అయినా, ఆయన పై అంచనాలు మాత్రం తగ్గ లేదు. ఒక్క లాగడపాటే కాదు, తెలంగాణా విషయంలో అందరి అంచనాలు తప్పాయి. అయితే ఈసారి ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారో అనే విషయం పై నోరు విప్పారు. శనివారం సాయంత్రం ఆయన విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డైరెక్ట్ గా చెప్పకుండా, ఏపి ఎన్నికల ఫలితాల పైన చెప్పకనే చెప్పేసారు. తెలంగాణ ఎన్నికల పైన తన జ్యోస్యం ఎందుకు విఫలమైందో కూడా చెబుతానంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశం లేదని.. కచ్చితమైన మెజార్టీతోనే ప్రభుత్వం ఏర్పడుతుందని లగడపాటి రాజగోపాల్ అన్నారు. తెలుగు ప్రజలు ఎప్పుడూ స్పష్టమైన తీర్పే ఇచ్చారని, తెలుగు ప్రజలు ఎప్పుడూ గజిబిజిగా తీర్పు ఇవ్వలేదన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా కేంద్రంతోనూ ప్రజల భవిష్యత్తు ముడిపడి ఉన్నందున సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయోనని ఉత్కంఠతో ఎదరుచూస్తున్నారని చెప్పారు. రాజధాని నిర్మాణం, చేపట్టిన ప్రాజెక్టులు.. కేంద్రం, రాష్ట్ర సహకారంతోనే సాధ్యమన్న ప్రత్యేక దృష్టితో ప్రజలు చూస్తున్నారన్నారు.
‘‘ఈ నెల 23న స్పష్టంగా ఫలితాలు తెలుస్తాయి. రేపు చివరి దశ ఎన్నికల తర్వాత అనేక ఎగ్జిట్‌పోల్స్, సర్వేలు ప్రజల ముందుకు రాబోతున్నాయి. నేను విదేశీ పర్యటనకు వెళ్లిన సందర్భంలో అక్కడి ప్రవాసాంధ్రులతో మాట్లాడా. వారు కూడా మనకంటే ఎక్కువ ఆసక్తితో రాష్ట్రంలోని ఫలితాలపై ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. మనం కోరుకోకుండానే రాష్ట్రం ఏర్పడింది.. రాజధాని, నిధులు లేవు. ఆనాడు పాండవులు ఖాండవ వనాన్నిఇంద్రప్రస్థగా మార్చుకున్నారు. అలనాటి మయసభలాంటి అసెంబ్లీ భవనం అమరావతిలో రాబోతోంది. అందరూ అసూయపడేలా మన రాజధాన అభివృద్ధిలోకి వస్తుంది. మన రాజధాని కోసం రైతులు త్యాగం చేశారు. ప్రతి ఒక్కరూ రాజధానిపైఆసక్తితో చూస్తున్నారు’’ అన్నారు. ‘‘తెలంగాణ మిగులు బడ్జెట్ వున్న ప్రాంతం. అందుకే అక్కడి ప్రజలు కారు ఎన్నుకున్నారు. ఏపీ లోటు బడ్జెట్ ప్రాంతం గనక ప్రజలకు సైకిల్ మార్గమైంది. ఇరు ప్రాంత ప్రజలు వారి ఆలోచనలకు అనుగుణంగా కావాల్సిన వాహనం ఎక్కారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడతారు. మెగస్టార్ చిరంజీవికంటే కొద్దిగా తక్కువగానే ఉంటారు’’ అని అభిప్రాయపడ్డారు.