ఆంధ్ర ఆక్టోపస్ తెలంగాణ ఎన్నికల ఫలితాల పై చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ లో జరిగే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధులు ఎనిమిది నుంచి పది మంది వరకు గెలిచే అవకాశం ఉందని రెండు రోజుల క్రిందట చెప్పటంతో రాజకీయ పార్టీల్లో కలకలం రేపింది. దీని పై టిఆర్‌యస్ సీరియస్ గానే రియాక్ట్ అయింది. సన్నాసి గాడు అంటూ కేసీఆర్ స్పందించారు. ఇదే సమయంలో, ఈ రోజు లగడపాటి మొత్తం వివరాలు చెప్పారు. ప్రతి ఎన్నికలప్పుడు కూడా పార్టీలకు అతీతంగా తాను సర్వే నిర్వహిస్తున్నానని, ఇలా సర్వేలు నిర్వహించడం తన అలవాటని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. తెలంగాణ ఎన్నికలు మరో మూడు రోజుల్లో జరగనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన సర్వేలో పాక్షిక వివరాలను వెల్లడించారు.
తెలంగాణ ఎన్నికల్లో ఫలితాలపై తన సర్వే వివరాల్లో కీలక అంశాలను బయటపెట్టారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. ఎన్నికల్లో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుస్తారని మొన్న చెప్పానని, ఇప్పుడు మరో ముగ్గురు అభ్యర్థుల పేర్లను చెబుతానని అన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్ రెబెల్ మల్ రెడ్డి రంగారెడ్డి, మక్తల్ నుంచి జలంధర్ రెడ్డి , బెల్లంపల్లి నుంచి బీఎస్పీ అభ్యర్థి జి.వినోద్ గెలుస్తారని తన సర్వేలో వెల్లడైనట్లు చెప్పారు. తాజా పరిస్థితులను బట్టి కాంగ్రెస్‌కే అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంటుందని, వరంగల్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో టీఆర్ఎస్ కు ఆధిక్యత లభిస్తుందని, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రం పోటాపోటీ ఉంటుందని లగడపాటి అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ లో ఎక్కువ స్థానాల్లో ఎంఐఎంకు, ఆ తర్వాత బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు గెలుస్తాయని లగడపాటి రాజగోపాల్ తన సర్వేలో పాక్షిక వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ప్రజానాడీ కాంగ్రెస్ పార్టీ వైపు ఉందని, విభజన తర్వాత ప్రజల మధ్య ఎలాంటి రాగద్వేషాలు లేవని అన్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు గాను వంద నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించామని, అన్ని సామాజిక వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించామని చెప్పారు. అయితే పూర్తి వివరాలను ఏడో తారీఖున పోలింగ్ తర్వాత బయటపెడతానన్నారు. పోలింగ్ శాతం పెరిగితే ప్రజాకూటమిదే విజయమన్న ఆయన.. తగ్గితే మాత్రం హంగ్ వస్తుందన్నారు. తనకు తానుగా వివరాలను బయటపెడితేనే వాటిని నమ్మాలని లేకపోతే... నమ్మొద్దని చెప్పారు. ఎవరికీ లొంగని వ్యక్తిత్వం తనదని.. స్వతంత్రుడిగా ఫలితాలను చెబుతున్నానన్నారు. తనపై ఎవరి ఒత్తిడి లేదని తేల్చిచెప్పారు.