ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ రూపొందించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వివాదం కడప జిల్లా జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావుకు చుట్టుకుంది. ఆయనను ఎన్నికలకు సంబంధం లేని విధులకు బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల వేళ దేశంలో పలువురు నేతల బయోగ్రఫీ చిత్రాలు రూపొందాయి. ఇందులో భాగంగా రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని రూపొందించారు. వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకు వర్మ చంద్రబాబుకు వ్యతిరేకంగా సినిమా రూపొందించారని టీడీపీ శ్రేణులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. అలాగే మోదీ బయోగ్రఫీపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికలు పూర్తయ్యేవరకు బయోగ్రఫీ చిత్రాలను విడుదల చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అయితే మే 1న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను రాంగోపాల్‌వర్మ విడుదల చేశారు.
కడపలోని రహత్ థియేటర్, రైల్వేకోడూరులోని ఏఎస్‌ఆర్, పోరుమామిళ్లలోని వెంకటేశ్వర థియేటర్‌లలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలైంది. అక్కడ సినిమాను ప్రదర్శించారు. ఈ విషయం రాష్ట్ర ఎన్నికల అధికారి దృష్టికి వెళ్లింది. ఎన్నికల నియమావళి ప్రకారం లక్ష్మీ్‌స ఎన్టీఆర్ సినిమాను అడ్డుకోవడంలో జేసీ విఫలమయ్యారని ఆయనకు ఎన్నికలకు సంబంధంలేని పోస్టుకు బదిలీ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. ద్వివేది సిఫారసును కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించడంతో జాయింట్ కలెక్టర్‌ను ఎన్నికలకు సంబంధం లేని బాధ్యతను అప్పజెప్పనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 19వ తేదీ వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రాష్ట్రంలో విడుదల చేయకూడదని ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు.