ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముగియడంతో ఫలితాలపై ఎవరికి తోచిన విధంగా అంచనాలు వేసుకుంటున్నారు. తామే మళ్లీ అధికారంలోకి వస్తామని టీడీపీ, ఈసారి తమదే సీఎం పీఠమని వైసీపీ ధీమాగా ఉన్నాయి. జనసేన సైతం తాము ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని అంటోంది. ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ నేత, మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ గురువారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. జనసేన 88 స్థానాల్లో విజయం సాధిస్తుందని, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.

lakshmi 19042019 2

ఈ మేరకు ట్విట్టర్‌లో స్పందించిన విజయసాయి.. సొంతంగా పోటీ చేసిందే 65 సీట్లలో పోటీచేసిన జనసేన 88 చోట్ల గెలుస్తుందని వీవీ లక్ష్మీనారాయణ జోస్యం చెబుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘సొంతంగా పోటీ చేసిందే 65 సీట్లలో.. పవన్ కళ్యాణ్ అనుంగు అనుచరుడు జేడీ లక్ష్మీనారాయణేమో 88 స్థానాల్లో గెల్చి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని జోస్యం చెబుతున్నాడు. ఇతను దర్యాప్తు చేసిన కేసుల్లో కూడా ఇలాగే లేనివి ఉన్నట్టు రాశాడు. ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా?’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్టర్‌లో స్పందించారు. అయితే విజయసాయి రెడ్డి వ్యాఖ్యల పై లక్ష్మీనారాయణ ఘాటుగా బదులు ఇచ్చారు. ఈ రోజు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.

lakshmi 19042019 3

"గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు @VSReddy_MP గారు, @JanaSenaParty పోటీ చేసింది 140 స్థానాలు సొంత బలం మీద. మిత్రపక్షాలైన బి.ఎస్.పి 21, సి.పి.ఐ., సి.పి.ఎం వామపక్షాలు 14. అలా మొత్తం చేరి 175 స్థానాలకు జనసేన కూటమి పోటీ చేసింది. మా లెక్కలు ఖచ్చితంగా ఉంటాయి, మా లెక్కలు సరిగ్గా ఉంటాయి. మీరు CA చదివారు అయినా కూడా మీ లెక్కలు తప్పులు ఎలా అవుతున్నాయో మాకు అర్ధం అవ్వట్లేదు. మీ లెక్కలు సరిచూసుకోండి ఎందుకంటే మేము సత్యం, న్యాయం మీద ఆధారపడి పనిచేసేవాళ్ళం కాబట్టి. మీ తప్పుడు లెక్కల వల్ల ఎంతోమంది ఇరుక్కున్నారు. ఇప్పటికైనా మంచి లెక్కలు నేర్చే విధానాన్ని మొదలుపెట్టండి." అంటూ విజయసాయి రెడ్డికి, కౌంటర్ ఇచ్చారు లక్ష్మీనారాయణ.

Advertisements

Advertisements

Latest Articles

Most Read