తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుతో పాటు వైద్య పరీక్షలు అందించడంపై శ్రద్ధ పెట్టాలని విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. తుపాను నేపథ్యంలో సీఎం, ప్రభుత్వం అందిస్తున్న సహాయ చర్యలను ఆయన అభినందించారు. రెండు రోజులుగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన మంగళవారం శ్రీకాకుళం జిల్లా పలాస క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిశారు. పర్యటనలో తన దృష్టికి వచ్చిన అంశాలను.. పరిష్కారాలను లేఖ రూపంలో వివరించారు.
ప్రతి గ్రామానికి ఒక ఉద్యాన అధికారిని ఏడాది కాలానికి నియమించాలి. అక్కడ ఉద్యాన పంటల అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించి అమలుకు చర్యలు చేపట్టాలి. కొబ్బరి రైతులకు ఆర్థిక సాయం అందించాలి. కొబ్బరి కాయలను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలి. లేదంటే రైతులకు లాభం కలిగించేలా మార్కెట్ ధరలను నియంత్రించాలి. పడిపోయిన చెట్ల తొలగింపు కోసం పెట్రోలుతో నడిచే పవర్ కట్టర్లను అందించాలి. తక్కువ సమయంలో ఫలాలనిచ్చే పండ్లతోటల సాగుకు పెద్దఎత్తున చర్యలు తీసుకోవాలి. కనీసం ఒక ఏడాది పాటు ఇక్కడి విద్యార్థులకు ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల్లో ఉచిత విద్య అందించాలి.
వంటగ్యాస్, విద్యుత్తు ఏడాది పాటు ఉచితంగా అందించాలి. మహిళలకు చీపుర్లు తయారీలో శిక్షణ ఇప్పించాలి. సహకార విధానంలో ఉత్పత్తి చేయించి ఆర్థిక, సహకార, మార్కెటింగ్ పరంగా ప్రోత్సాహం ఇవ్వాలి. పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల ద్వారా కొనుగోలు చేయించాలి. కొబ్బరి ఆధారిత ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. కోకో తోటల పెంపకానికి చేయూత ఇవ్వాలి. కవిటి మండలంలోని 17 గ్రామాల్లో 100 బోర్లు తవ్వాలి. ప్రత్యామ్నాయ పండ్లతోటల సాగుకు ఇది ఉపకరిస్తుంది. మత్స్యకారుల కోసం వేర్వేరు ప్రాంతాల్లో జెట్టీలు ఏర్పాటు చేయాలి. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద మూడేళ్లు ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకునేలా చూడాలి. కవిటిలో డయాలసిస్ యూనిట్లను విస్తరించాలి. వైద్య పరీక్షలు నిరంతరాయంగా కొనసాగించాలి. గుడిసెల స్థానంలో పక్కా గృహాల నిర్మాణం చేపట్టాలి.