అందరికీ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ప్రయోగశాల అయిపోయిందో ఏమో కాని, తెలంగాణా రాష్ట్రంలో అన్ని దారుణాలు జరుగుతున్నా, అక్కడ పట్టించుకోకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీల మీద పార్టీలు పెడుతున్నారు. ఇప్పటికే పవన్, జగన్ కళ్యాణ్ తెలంగాణాలో జెండా ఎత్తేసి ఏపిలో మాత్రమే ఉన్నారు. పవన్ కి పోటీగా ప్రజాశాంతి పార్టీ కూడా ఏపి మీదే ఫోకస్ అని చెప్పేసింది. ఇక బీజేపీ పార్టీ పెట్టించిన జన జాగృతి పార్టీని చూసాం. ఇప్పుడు సిబిఐ మాజీ జేడీ కూడా కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఈయన ఇప్పటికే ఏపిలో మాత్రమే పర్యటన చేసారు కాబట్టి, ఈయన ఫోకస్ కూడా ఏపి మీదే ఉంటుంది అనేది స్పష్టం. ఎన్నికల దగ్గర పడే కొద్దీ, ఇలా పార్టీలు పెట్టించి, ఓట్లు చీల్చటం బీజేపీ ఎత్తుగడలో ఒక భాగం. అయితే, లక్ష్మీనారాయణ పార్టీ వెనుక ఎవరు ఉన్నారో, ఆయన నడవిక బట్టి, త్వరలోనే తెలిసిపోతుంది.
కొత్త పార్టీకి సంబంధించి ఆయన ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. ఈనెల 26న ఆయనే స్వయంగా దీనిపై ప్రకటన చేయనున్నారు. పార్టీ జెండా, అజెండా, సిద్ధాంతాల గురించి స్వయంగా వివరించనున్నారు. సిబిఐ ఆఫీసర్ గా ఉన్నప్పటినుంచే ఆయన గ్రామీణ సమస్యల పై, ప్రత్యేకించి రైతుల ఇక్కట్ల పై అధ్యయనం చేస్తానంటూ, రాజీనామా చేసి వచ్చారు. పదవీ విరమణ తీసుకున్నాక రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. ఇప్పుడు కొత్త పార్టీ పెడుతున్నారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా ఆయన వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై నమోదైన అక్రమాస్తుల కేసు, సత్యం కంప్యూటర్స్, గాలి జనార్దన్‌రెడ్డి అక్రమాలపై కేసులను దర్యాప్తు చేయటం ద్వారా వెలుగులోకి వచ్చారు.
కొంతకాలంగా లక్ష్మీనారాయణ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు వినిపించాయి. ఓ జాతీయ పార్టీలో చేరతారని, తమతో కలిసి పనిచేయాలని మరో పార్టీ ఆహ్వానించిందని ప్రచారం జరిగింది. వీటన్నింటికీ ఆయన విరామమిస్తూ సొంతంగానే పార్టీ ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాల్లో సంస్కరణలే పార్టీ ప్రధాన అజెండాగా ఉంటుందని ఆయన వర్గాలు చెప్తున్నాయి. అయితే, సరిగ్గా ఎన్నికల ముందు పార్టీ రావటం, ఆయన ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో పాల్గునటం, ఇవన్నీ చూస్తుంటే, ఆయన ఎజెండా పై అనుమానాలు కలుగుతున్నాయి. చూద్దాం, మరి కొద్ది రోజుల్లో, ఆయన ఏమైనా రాజకీయ అజెండాతో ఎవరినైనా దెబ్బ తియ్యటానికి వస్తున్నారా, లేక నిజంగానే రైతు సమస్యల పరిష్కారనికి వస్తున్నారో తెలిసిపోతుంది.