రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో ఎల్‌ఈడీ వెలుగులు నింపాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఇంధన, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రత్యేకించి గ్రామీణ ఇంధన సామర్థ్యం కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూరు శాతం ఎల్‌ఈడీ లైట్ల వాడకం ద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను అత్యున్నత స్థాయికి చేర్చుతామన్నారు. దేశంలోనే తొలిసారిగా, ప్రత్యేకించి మన రాష్ట్రంలో 30 లక్షల సంప్రదాయ వీధి దీపాల స్థానంలో ఎల్‌ఈడీ లైట్లను అమర్చే కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
ఈ విషయంలో ఇప్పటికే చరిత్ర సృష్టించామని, ఇదే స్ఫూర్తితో అక్టోబరుకల్లా 10 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలను అమర్చే బృహత్తర కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సీఎం చెప్పారు. ఇంధన సామర్ధ్యంలో అంతర్జాతీయ ప్రమాణాలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి సారించి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. తూర్పు గోదావరి జిల్లాను దేశంలోనే నూరు శాతం ఎల్‌ఈడీ వీధి దీపాలు కలిగిన జిల్లాగా నిలిపి రికార్డు సృష్టించామని, అలాగే రెండో దశలో అక్టోబరుకల్లా 10 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలు అమర్చే లక్ష్యా న్ని చేరుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు కార్యక్రమాన్ని విప్లవాత్మక చర్యగా అభివర్ణించిన సీఎం దీనిద్వారా గ్రామీణ ప్రాంత ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.
తూర్పు గోదావరిని ఆదర్శంగా తీసుకుని అన్ని జిల్లాల్లో నూరు శాతం ఎల్‌ఈడీ వీధి లైట్లను అమర్చాలని విద్యుత్తు సంస్థలను ఆదేశించారు. అన్ని శాఖ ల్లోనూ ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేయాలన్నారు. నేటికి తొలిదశలో ఈఈఎస్‌ఎల్ ద్వారా 8.6 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేశామని, 2.78 లక్షల లైట్లను ఆన్‌లైన్ డాష్ బోర్డుకు అనుసంధానం చేసినట్లు పంచాయతీరాజ్ మరియు రూరల్ డవలప్‌మెంట్ ముఖ్యకార్యదర్శి జవ హర్ రెడ్డి తెలిపారు. ప్రతి 100 అడుగుల దూరంలో ప్రతి మూడు ఇళ్లకు కనీసం ఒక ఎల్‌ఈడీ వీధి లైటు ఉండేలా చూసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.