ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ డబ్బు కోసం కూడా వెతుక్కుంటున్న ఏపి ప్రభుత్వం, ఈ సారి ఏకంగా అభయ హస్తం పధకానికి చెందిన, మహిళలు దాచుకున్న సొమ్ముని కూడా రాష్ట్ర ప్రభుత్వం వదల లేదు. వాటి పైన రాష్ట్ర ప్రభుత్వం కన్ను పడింది. అభయ హస్తం పధకం కింద, మహిళలు రోజుకి ఒక రూపాయి పొదుపు చేస్తే, ప్రభుత్వం ఇంకో రూపాయి ఇస్తుంది. ఈ విధంగా మహిళలు పొదుపు చేసిన 365 రూపాయాలు, ప్రభుత్వం ఇచ్చే 365 రూపాయాలు కలిపి, మొత్తంగా ఏడాదికి రూ.730 పొదుపు చేస్తే, ఇలా డబ్బులు దాచుకుంటున్న మహిళలకు, 60 ఏళ్ళు దాటిన తరువాత, నెలకు 700 రూపాయల నుంచి 2300 వరకు పెన్షన్ వచ్చే విధంగా, గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పధకాన్ని రూపొందించింది. ముఖ్యంగా వృద్ధ మహిళలకు, అభయం ఇచ్చేందుకు ఈ పధకం రూపొందించారు. ఈ రకంగా పొదుపు చేసుకుంటున్న మహిళలకు, జీవిత భీమా కూడా వర్తించే విధంగా ఎల్‍ఐసీ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుని, డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకున్న ఈ మొత్తం, ఎల్‍ఐసీలో నేటి వరకు కూడా రూ.2 వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ పధకం గత అనేక ప్రభుత్వాలుగా వస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ఈ సొమ్ము పైన కన్ను పడింది.
మొత్తంగా దాదాపుగా 35 లక్షల మంది మహిళలు ఈ పధకం కింద అర్హులుగా ఉండి, ఈ రోజు వరకు కూడా తమ సొమ్ముని పొదుపు చేసుకుంటున్నారు. 60 ఏళ్ళు దాటిన వారికి 4 లక్షలకు పైగా ఈ రోజుకీ పెన్షన్లు వస్తున్నాయి. అయితే వీరికి సంబంధించిన 2 వేల కోట్లు ఎల్‍ఐసీ వద్ద ఉండటంతో, అప్పుల కోసం బ్యాంకులు చుట్టూ తిరుగుతున్న ప్రభుత్వానికి, ఇది చూసి, ఇది కూడా తమకు ఇచ్చేయాలని, ఎల్‍ఐసీ కి లేఖ రాసి, తామే ఇక నుంచి ఈ పధకం చూసుకుంటాం అని ప్రభుత్వం కోరటంతో, ఎల్‍ఐసీ ఆ మొత్తం సొమ్ముని ప్రభుత్వానికి బదిలీ చేసింది. దీంతో ఈ అభయ హస్తం పధకం కూడా అయిపోయిందని మహిళలు అంటున్నారు. ఇదే విషయాన్ని తమ మీదకు ఎక్కడ వస్తుందో అని, ఎల్‍ఐసీ ఒక పత్రికా ప్రకటన జారీ చేసి, ఇక నుంచి ఈ పధకంతో తమకు సంబంధం లేదని, మొత్తం ప్రభుత్వం చూసుకోవాలని తేల్చి చెప్పారు. తమకు ఈ పధకంతో సంబంధం లేదని, బహిరంగంగా ప్రకటన జారీ చేసింది. ఇది ఒక రకంగా ప్రభుత్వ పరువు పోయినట్టే అని చెప్పాలి. మరి ఈ పధకం ఏమి అవుతుందో చూడాలి.