పోలవరం విషయంలో దాదాపు రెండు నెలలు నుంచి ఉన్న ప్రతిష్టంభన తొలిగిపోయింది... ప్రాజెక్టు స్పిల్ వే, స్పిల్ చానల్ కాంక్రీట్ పనులు, మట్టి పనులకు పిలిచిన టెండర్ల ప్రక్రియకు ఎదురైన అవరోధాలు తొలిగిపోయాయి... చంద్రబాబు ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు... కొత్త టెండర్లను కేంద్రం అడ్డుకున్న సంగతి తెలిసిందే... చంద్రబాబు దసరా పండుగ రోజు, నాగపూర్ లోని నితిన్ గడ్కరీ ఇంటికి వెళ్లి మరీ, టెండర్ల ప్రక్రియ అడ్డుకోవద్దు అని, అవి ఎందుకు అవసరమో మొత్తం వివరించారు... అయినా రెండు నెలలు నుంచి కేంద్రం తాత్సారం చేస్తూ వచ్చింది... ఎట్టకేలకు, ఈ టెండర్ల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
గురువారం కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్.. రాష్ట్ర జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే, చానల్ కాంక్రీట్ పనులకు పిలిచిన టెండర్ల గడువు శుక్రవారంతో ముగియనున్న అంశం వీరి నడుమ చర్చకు వచ్చింది. పోలవరం కాంక్రీట్ పనుల్లో వేగం పెరగాలంటే ఈ టెండర్లను ఓపెన్ చేయాల్సి ఉందని యూపీ సింగ్‌కు శశిభూషణ్ కుమార్ వివరించారు. ఆయనతో ఏకీభవించిన యూపీ సింగ్.. టెండర్ల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు.
పోలవరం ప్రాజెక్టు అథారిటీ టెండర్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గురువారమే కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్, పోలవరం ప్రాజెక్టు సీఈవో హల్దర్‌కు శశిభూషణ్ కుమార్ విడివిడిగా లేఖలు రాశారు. మరో వారం రోజుల్లో పీపీఏ సమావేశం జరిగేలా చూస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో స్పిల్ వే, చానల్ కాంక్రీటు పనులకు పిలిచిన టెండర్ల ప్రక్రియ సుఖాంతం అవుతుందని జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ టెండర్లను తెరిచిన తర్వాత కొత్త సంస్థకు బాధ్యతలు అప్పగించి పనుల వేగాన్ని పెంచితే 2018కి గ్రావిటీ ద్వారా నీటిని అందించడంతోపాటు 2019కి ప్రాజెక్టును పూర్తి చేయగలుగుతామని జల వనరుల శాఖ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.