ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్ర ప్రభుత్వం, మేము మద్య నిషేధం చేస్తున్నాం అంటూ, ఇందులో భాగంగా, షాపులు తగ్గిస్తున్నాం, రేట్లు పెంచేస్తున్నాం, ఆ రేట్లు చూస్తే షాక్ కొట్టే విధంగా ఉంటాయి, దీంతో అసలు మందు తాగటమే మానేస్తారు, మద్య నిషేధం లో ఇది ఒక భాగం అంటూ ఊదరగొట్టారు. అయితే ఈ క్రమంలో ఊరు పేరు లేని బ్రాండులు తెచ్చి, మార్కెట్ లోకి వదలటంతో, మందు బాబులకు నిజంగానే షాక్ కొట్టింది. అందులో నాసిరకం సరుకు పెడుతున్నారని, బ్రాండెడ్ వాటి కంటే భారీగా రేట్లు పెంచేసారని, ఆరోగ్యంతో ఆటలు ఆడుకోకుండా, కనీసం బ్రాండెడ్ మందు అయినా మార్కెట్ లోకి వదలాలని గోల గోల చేసారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక దీనికి తోడు తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే మద్యం అయితే అంతు లేకుండా వస్తుంది. ప్రభుత్వం స్పెషల్ డిపార్టుమెంటు పెట్టామని చెప్పినా, వారిని ఒకసారి ఎక్కడో ఒక చోటు పట్టుకుంటూ ఉన్నా, బయట రాష్ట్రాల నుంచి వచ్చే మద్యం మాత్రం కంట్రోల్ లేదు. ఈ దందా అంతా కూడా అధికార పార్టీ నేతలే నడుపుతున్నారనే ప్రచారం కూడా ఉంది. ఇవన్నీ నడుస్తూ ఉండగానే, లాక్ డౌన్ వచ్చింది. దాదాపుగా మూడు నెలలు అన్నీ మూసుకు పోయి ఉన్నాయి. మందు బాబులకు కూడా ఈ కష్టాలు తప్పలేదు. దీంతో శాశ్వతంగా ఈ షాపులు మూసేయటానికి ఇదే మంచి తరుణం అని అందరూ ప్రభుత్వాన్ని కోరారు. అలవాటు తప్పి పోయింది కాబట్టి, ప్రభుత్వం చెప్పిన మద్యపాన నిషేధానికి ఇదే కరెక్ట్ టైం అని, ఇలాంటి అవకాసం మళ్ళీ రాదని చెప్పినా, ప్రభుత్వం దేశంలోనే మొదటి సారి మన రాష్ట్రంలోనే లాక్ డౌన్ తరువాత మద్యం షాపులు తెరిచింది.
రేట్లు కూడా భారీగా మళ్ళీ పెంచింది. అయినా వెనక్కు తగ్గలేదు మందు బాబులు. అయితే మళ్ళీ ప్రభుత్వం ఏమి అనుకుందో ఏమో, ఈ సారి మద్యం రేట్లు తగ్గించింది. మద్యపాన నిషేధంలో భాగంగా షాక్ కొట్టే రేట్లు పెట్టామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు ఎందుకు తగ్గించేందో ఎవరికీ అర్ధం కాలేదు. ప్రభుత్వ రెండు నాల్కుల ధోరణి ఇక్కడే అర్ధం అవుతుంది. ఇక దీంతో మందు బాబులకు అడ్డు అదుపు లేకుండా పోయండి. మద్యపాన నిషేధం అనే ప్రభుత్వ మాటలు ఉత్తిత్తి మాటలు గానే మిగిలిపోయాయి. అమ్మాకలు 50 శాతం పైగా పెరిగాయి. ఈ ఏడాది మే నుంచి ఆగష్టు వరకు 12 లక్షల కేసులు లిక్కర్, 2.5 లక్షల కేసుల బీరు అమ్మిన ప్రభుత్వం, సెప్టెంబర్ నెలలో 18.39 లక్షల కేసులు లిక్కర్, 5.82 లక్షల కేసుల బీర్ అమ్మింది. దీంతో ఇటు ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుంది. మరి ఈ లెక్కలు చూసిన ఎవరైనా దీన్ని మద్యపాన నిషేధం అంటారా ? ఈ నెల అంటే, అక్టోబర్ నెలలో కూడా ఇప్పటికే భారీగా అమ్మకాలు జరిగాయని, పండుగ సీజన్ కావటంతో, ఈ సారి సేల్స్ సెప్టెంబర్ కంటే ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. మరి ప్రభుత్వ పెద్దలు, ఈ నిర్ణయాన్ని ఎలా సమర్ధించుకుంటారో చూడాలి.