నూటయాభై దేశాల్లో పరిశ్రమలున్న జపాన్ సంస్థ లిక్జిల్ భారత్‌లో తొలిసారి పశ్చిమగోదావరి జిల్లాలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. జిల్లాలోని భీమడోలు మండలం అంబరుపేటలో రూ.400 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థ ఏర్పాటు చేసిన నీరు, గృహావసరాల (శానిటరీ వేర్) తయారీ కేంద్రాన్ని ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, పరిశ్రమలశాఖ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి వల్లే రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చినరాజప్ప చెప్పారు.
దావోస్‌లో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు లిక్జిల్ సంస్థ ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసిందని వివరించారు. 45 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమలో 400 మందికి ఉపాధి కలుగుతుందన్నారు. స్వచ్ఛభారత్, స్వచ్ఛఆంధ్ర కార్యక్రమాలతో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఇలాంటి పరిశ్రమలు అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రంలో మూడు పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుల ద్వారా రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులను ఆహ్వానించామని అమర్‌నాథ్‌రెడ్డి చెప్పారు.
ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకున్న సంస్థలతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సమస్యలను అధిగమిస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇలా ఎంఓయూలు కుదుర్చుకున్న వాటిలో 15 శాతం పురోగతి ఉంటే.. మన రాష్ట్రంలో 45 నుంచి 50 శాతం పురోగతి ఉందని వివరించారు. ఆహార రంగ యూనిట్ల ఏర్పాటులో 60 శాతం పురోగతి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లిక్జిల్ సంస్థ అధ్యక్షుడు కిన్యాసెటో, సీఈఓ బిజోయ్‌మోహన్, జిల్లా కలెక్టర్ కె.భాస్కర్, జపాన్ రాయబారి హిరామట్ను, రాష్ట్ర ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
మరో పక్క, శ్రీసిటీ సెజ్‌లో మరో పారిశ్రామక సంస్థ కొలువుదీరింది. జపాన్, దక్షిణ కొరియా భాగస్వామ్యంతో ఏర్పాటైన ఎంసిఎన్‌ఎస్ పోలియూరీథేన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యూనిట్ ఉత్పత్తి ప్రారంభించింది. కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కిడాన్‌వాన్, మేనేజింగ్ ఎడ్యుకేట్ ఆఫీసర్ తడాని యోషినో, సిఇఒ యూజూన్‌లిమ్, షింగోషిబాక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐదు ఎకరాల విస్తీర్ణంలో రూ.50 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌లో ఏటా 15,000 టన్నుల పోలియూరీఽథేన్స్ వస్తువులు తయారు చేస్తారు. ఈ ప్రారంభోత్సవంలో కంపెనీ ప్రతినిధులతోపాటు శ్రీసిటీ ఎండి రవీంద్ర సన్నారెడ్డి పాల్గొన్నారు.