అదాని కంపెనీ ఊరికే ఆంధ్రప్రదేశ్ కి రాలేదు. దీని వెనుక ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కష్టం ఎంతో ఉంది. లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పిస్తా అన్నప్పుడు తలా తోక లేని రాష్ట్రంలో లక్ష ఐటీ ఉద్యోగాల అని ఎద్దేవా చేసిన వారు ఎందరో. కానీ ఇచ్చిన హామీ ని నిలబెట్టుకోవడానికి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లారు లోకేష్. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అనే విధంగా లోకేష్ పనిచేసారు. గత సంవత్సరం దావోస్ పర్యటన లో అదాని గ్రూప్ ముఖ్యులను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనువైన పరిస్థితులుని వివరించిన మంత్రి నారా లోకేష్. ఆ తరువాత ఫిన్ టెక్ ఫెస్టివల్ సందర్భంగా మరో సారి అదాని బృందంతో భేటీ అయ్యి అదాని గ్రూప్ తో చర్చలు జరిపారు.
అదాని గ్రూప్ డేటా సెంటర్ల బిజినెస్ లోకి అడుగుపెడుతుంది అని తెలుసుకున్న వెంటనే మంత్రి నారా లోకేష్ రంగంలోకి దిగారు. స్వయంగా ఆయనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న క్లౌడ్ హబ్ పాలసీ గురించి వివరించి అదాని గ్రూప్ ని ఒప్పించారు. అనుమతులు,అనువైన భూమి ,మౌలిక వసతుల కల్పన,వివిధ శాఖలతో అనుసందానం ఇలా అన్ని తానై అదాని గ్రూప్ ఆంధ్రా కి వచ్చే విధంగా మంత్రాంగం నడిపించారు. ఇతర రాష్ట్రాల నుండి ఉన్న పోటీ నేపధ్యంలో ఎక్కడా సమాచారం బయటకి రాకుండా జాగ్రత్త పడుతూనే పని చక్కబెట్టారు లోకేష్. కేవలం మూడు నెలల్లో వారికి కావాల్సిన అనుమతులు, రాయితీలు,భూమి ఇలా అన్నింటి పై స్పష్టత వచ్చే లా చేసి స్వయంగా గౌతమ్ అదాని అమరావతిలో అడుగు పెట్టే విధంగా చేసారు.
ఆంధ్రప్రదేశ్‌లో డేటా పార్క్, సోలార్ పార్క్‌ల ఏర్పాటుకు రూ.70 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ, అదానీ గ్రూప్ మధ్య బుధవారం ఒప్పందం కుదిరింది. రాబోయే 20 ఏళ్లలో లక్ష ఉద్యోగాల కల్పనకు వీలుగా రూ.70వేల కోట్ల పెట్టుబడులు పెడుతుంది. విశాఖపట్నంలోని 500 ఎకరాల్లో ఒక గిగా వాట్ డేటా సెంటర్ (మూడు కేంద్రాలు) ఏర్పాటు చేస్తుంది. 5 గిగా వాట్స్ సోలార్ పార్క్‌ను కూడా నెలకొల్పుతుంది. ఈ డేటా కేంద్రాన్ని ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌తో అనుసంధానించడం ద్వారా మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించే కీలక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.