ప్రపంచ యువ నాయకుడిగా ఏపీ మంత్రి లోకేశ్‌ను ప్రపంచ ఆర్థిక వేదిక మరోసారి ఎంపిక చేసింది. 2019 యంగ్ గ్లోబల్ లీడర్ల జాబితాను ప్రపంచ ఆర్థిక వేదిక బుధవారం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో లోకేశ్ కీలకపాత్ర పోషించారని జాబితాలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 127 మందిలో దక్షిణ ఆసియాకు చెందిన 12 మంది ఉన్నారు. భారత్ నుంచి ఇప్పటివరకు ‘ప్రజాకర్షక’ జాబితాలో ఆరుగురికి అరుదైన గౌరవం లభించింది. ఐదేళ్లపాటు యంగ్ గ్లోబల్ లీడర్‌గా ప్రపంచ ఆర్థిక వేదికలో మంత్రి లోకేశ్ ఇదివరకే కొనసాగుతున్నట్లు మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ప్రస్తావించారు.
మరో పక్క, నారా లోకేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారు. తొలుత విశాఖపట్నం జిల్లా భీమిలి నుంచి పోటీ చేయాలని భావించినా... వివిధ సమీకరణాల నేపథ్యంలో ఆ ప్రతిపాదనను విరమించుకుని మంగళగిరిని ఎంచుకున్నారు. భిన్నమైన రాజకీయ, సామాజిక సమీకరణాలుండే ఈ నియోజకవర్గం పాక్షికంగా రాజధాని అమరావతి పరిధిలో ఉంది. లోకేశ్ నివాసముండే ఉండవల్లి మంగళగిరి నియోజకవర్గంలోనే ఉంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా పలు బాధ్యతల నేపథ్యంలో రాజధానికి సమీపంలో ఉన్న నియోజకవర్గం అయితేనే వెసులుబాటు ఉంటుందని, ప్రజలకూ అందుబాటులో ఉండవచ్చనే ఆలోచనతోనే మంగళగిరిని ఎంచుకున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన అనంతరం ప్రభుత్వ యంత్రాంగం హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చాక ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు అధికంగా వచ్చి స్థిరపడింది మంగళగిరి ప్రాంతంలోనే. రాష్ట్రానికొచ్చిన ఐటీ సంస్థల్లోనూ అత్యధికం మంగళగిరి, తాడేపల్లిల్లోనే ఏర్పాటయ్యాయి.
రాజధాని పరిసరాల్లో అపార్టుమెంట్ల నిర్మాణంసహా అన్ని రూపాల్లో స్థిరాస్తి వ్యాపారం బాగా వృద్ధి చెందుతోందీ ఇక్కడే. మొదటి నుంచీ పార్టీకి కంచుకోటల్లాంటి భీమిలితోపాటు కృష్ణా జిల్లా పెనమలూరు, గుంటూరు జిల్లా పెదకూరపాడు వంటి పార్టీకి బలమైన నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలన్న ప్రతిపాదనలొచ్చినా వదిలేసి ప్రస్తుతం వైకాపా ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నుంచి పోటీ చేయాలని లోకేశ్ నిర్ణయించడం విశేషమే. 2 రోజుల్లో ప్రకటించనున్న తెదేపా అభ్యర్థుల మొదటి జాబితాలోనే ఆయన పేరు రానుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా తరఫున గంజి చిరంజీవి పోటీ చేసి వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో కేవలం 12 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అయితే లోక్‌సభకు పోటీ చేసిన గల్లా జయదేవ్‌కు ఈ శాసనసభ నియోజకవర్గం పరిధిలో 5,896 ఓట్ల ఆధిక్యం రావడం విశేషం. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న రామకృష్ణారెడ్డి రాజధాని వ్యవహారాలపై వివిధ రూపాల్లో ప్రభుత్వంపై ఉద్యమిస్తున్నారు. న్యాయస్థానాల్నీ ఆశ్రయించారు. వైఎస్ పేరుతో రాజన్న క్యాంటీన్లు, రాజన్న కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేశారు. ఇటీవల నియోజకవర్గ పార్టీలో వర్గ విభేదాలు నెలకొన్నాయి. ఆయన తిరిగి పోటీ చేయడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా అవన్నీ తొలగిపోయాయి. తిరిగి ఆయనే వైకాపా అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.