ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందామురి బాలకృష్ణ పై ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది. చంద్రబాబు వియ్యకుండు అయిన బాలకృష్ణ, ఆయన బంధువులు, అమరావతి రాజధాని ప్రకటన చేసేకంటే ముందే, అమరావతి ప్రాంతంలో 500 ఎకరాలు కొన్నారంటూ ఆరోపణలు చేసారు. చంద్రబాబు వియ్యంకుడిగా, బాలక్రిష్ణకు ముందే చెప్పి, అక్కడ భారీగా భూములు కొన్నారని, ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, ఆరోపించారు. నిన్న మంత్రి బొత్సా సత్యన్నారాయణ మాట్లాడుతూ, అమరావతిలో అతి పెద్ద స్కాం జరిగింది అని, దాన్నే ఇన్ సైడర్ ట్రేడింగ్ గా చెప్తూ, ఈ స్కాంను బయటకు తెస్తామని అన్నారు. బొత్సా ప్రెస్ మీట్ పెట్టగానే, వైసీపీ నేతలు, మీడియాకు ఈ లీకులు ఇచ్చారు. బాలకృష్ణ 500 ఎకరాలు కొన్నారంటూ లీకులు ఇచ్చారు.
ఇదే విషయాన్ని కొన్ని పత్రికలు ప్రధానంగా ఈ రోజు ప్రచురించాయి. బాలకృష్ణ, ఆయన బంధువులు, 500 ఎకరాలు అమరావతిలో కొన్నారని, రాజధాని ప్రకటన కంటే ముందే, వీళ్ళు కొన్నారంటూ, బొత్సా ప్రెస్ మీట్ వివరాలు చెప్తూ, ఇది కూడా రాసారు. ఒక ఇంగ్లీష్ పత్రికల్లో కూడా ఈ వార్త ప్రచురించింది. దీంతో ఇది నిజమేనేమో అని కొంత మంది నమ్మే పరిస్థితి. కాని బాలకృష్ణ పై మాత్రం, ఎప్పుడూ ఎలాంటి మచ్చ లేదు. తన తండ్రి సియంగా ఉన్నప్పుడు కాని, బావ సియంగా ఉన్నప్పుడు కాని, ఎప్పుడు పలనా అవినీతి చేసారు అనే ఆరోపణలు ఈ 40 ఏళ్ళ కాలంలో ఎప్పుడూ రాలేదు. ఈ రోజు వచ్చిన వార్తా పై, వెంటనే నారా లోకేష్ ట్విట్టర్ లో ఈ వార్తను ఖండించారు. ఈ వార్తా అటాచ్ చేస్తూ, జగన్ మోహన్ రెడ్డి గారు, అధికారంలో ఉన్నది ఇప్పుడు మీరే, ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న మీరు, బాలకృష్ణ గారు, ఆయన బంధువులు అమరావతిలో 500 ఎకరాలు కొన్నారని, నిరూపించండి అంటూ జగన్ మోహన్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి లోకేష్ ఛాలెంజ్ చేసారు.
ఇది లోకేష్ ట్వీట్ "వైకాపా నాయకులు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాం అనుకుంటున్నారు. వాళ్ళ ఫేక్ బతుకు మారలేదు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అసత్యాలతో కాలం నెట్టుకొస్తున్నారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని దెబ్బతియ్యడానికి ఇన్ సైడ్ ట్రేడింగ్ అంటూ బురద జల్లుతున్నారు. తండ్రి అధికారాన్నీ, శవాన్నిపెట్టుబడిగా పెట్టి ఎదిగిన చరిత్ర మీ నాయకుడిది. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా.. ఏ రోజూ అటు వైపు కూడా చూడకుండా స్వఛ్చమైన మనస్సు, నీతి, నిజాయితీతో ఎదిగారు మా బాలా మావయ్య. అటువంటి వ్యక్తి రాజధానిలో భూములు కొన్నారని ఆరోపణలు కాదు, దమ్ముంటే నిరూపించండి. లేక రాజధాని రైతులకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పండి."