ఎన్నికల పోలింగ్‌కు గడువు సమీపిస్తున్నవేళ అభ్యర్థుల జాబితాపై రాజకీయ పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఎక్కడి నుంచి ఎవరిని బరిలో దింపాలనే అంశంపై ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. తెదేపా ఇప్పటికే అభ్యర్థుల జాబితాను సిద్ధంచేసినప్పటికీ.. పెండింగ్ స్థానాలపై సీఎం చంద్రబాబు రెండు రోజులుగా తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈసారి మంత్రి లోకేశ్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించడంతో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో బుధవారం చంద్రబాబు.. లోకేశ్ పోటీపై స్పష్టత ఇచ్చారు. మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి లోకేశ్ పోటీ చేస్తారని పార్టీ అధినేత ప్రకటించారు. తొలుత భీమిలి, విశాఖ నార్త్ నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటి నుంచి ఆయన బరిలో దిగుతారని ప్రచారం జరిగినప్పటికీ చంద్రబాబు మాత్రం గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి లోకేశ్ పోటీ చేస్తారని ప్రకటించారు.
మరో పక్క, తెదేపా గురువారం తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 16న ఎన్నికల సమర శంఖారావం పూరించనున్నారు. ఆరోజు తొలుత తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం చిత్తూరు జిల్లా పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం శ్రీకాకుళానికి చేరుకుని ఆ జిల్లా పార్టీ శ్రేణులతో భేటీ అవుతారు. ఇలా 16 నుంచి 19వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తారు. జిల్లాస్థాయి నాయకత్వం మొదలుకుని సేవామిత్రలు, బూత్‌స్థాయి కన్వీనర్ల వరకూ పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించి, దిశానిర్దేశం చేయనున్నారు. ఈ పర్యటనలు ముగిశాక ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపడతారు. ఆయా జిల్లాల్లో బహిరంగ సభలు, రోడ్‌షోలు నిర్వహించనున్నారు.
సీఎం చంద్రబాబు కూడా ఎన్నికల సమరశంఖం పూరించేందుకు సిద్ధమయ్యారు. తొలి విడత ఎన్నికల్లోనే రాష్ట్రంలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆయన ప్రచార పర్వం షురూ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, మార్చి 16న ఎన్నికల ప్రచారానికి తెరలేపుతున్నారు చంద్రబాబు. ఈ మేరకు ఆయన ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 16న తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకోనున్న చంద్రబాబు అక్కడి నుంచి తిరుపతి వచ్చి మధ్యాహ్నం ఒంటిగంటకు సేవామిత్ర బూత్ కమిటీల సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం శ్రీకాకుళంలో ఎన్నికల ప్రచార సభకు హాజరవుతారు. ఆ మరుసటి రోజు మార్చి 17న విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పలు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మార్చి 18న ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. అనంతరం మార్చి 19న అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం చేపడతారు.