తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఈ రోజు విజయవాడలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవలే ఆయన హత్య కేసులో బెయిల్ పై బయటకు వచ్చారు. సౌమ్యుడు, వివాదరహితుడు అయిన కొల్లు రవీంద్రను ప్రభుత్వం కావాలనే కేసులో ఇరికించింది అంటూ, తెలుగుదేశం పార్టీ ఆరోపోస్తుంది. ఈ నేపధ్యంలోనే నారా లోకేష్, కొల్లు రవీంద్రను ఆయన నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లోకేష్, రాష్ట్రంలో రాజా రెడి రాజ్యాంగం నడిపిస్తున్నారని, ప్రభుత్వం చేస్తున్న పనుల పై పోరాడే అందరి మీద, అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయని, వీటి పై ఎలాంటి చర్యలు ఉండవు కానీ, తెలుగుదేశం నేతల పై మాత్రం అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. రవీంద్ర పై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసారని, ఒక ఉత్తరం రాస్తే అచ్చెన్నాయుడుని వేధించారని అన్నారు. ఆయన పై ఇప్పటికీ ఒక్క రూపాయి అవినీతి నిరూపించలేదని అన్నారు.
ఇక ఇప్పటికీ తమ పై అనేక ఆరోపణలు చేస్తున్నారని, 16 నెలలు అయ్యిందని, ఒక్క అవినీతి తమ పై నిరూపించారా ? ఛాలెంజ్ చేస్తున్నా, తమ పై ఆధారాలు ఉంటే అరెస్ట్ చేసుకోండి అంటూ, సవాల్ విసిరారు. తండ్రిని అడ్డు పెట్టుకుని లక్ష కోట్లు దోచుకున్నారని, అధికారులని జైలు చుట్టూ తిప్పారని, ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వస్తుందని, అధికారులు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఎవరినీ వదిలి పెట్టం అని, జగన్ మోహన్ రెడ్డికి, విర్రవీగుతున్న మంత్రులకు వడ్డీతో సహా చెల్లిస్తాం అని అన్నారు. కొడాలి నానికి ప్రస్టేషన్ ఎక్కువ అయ్యి, అందరి పైనా దుర్బాష లాడుతున్నారని, ప్రస్టేషన్ తగ్గించుకుంటే మంచిదని అన్నారు. ఇక అంతర్వేది ఘటన పై స్పందిస్తూ, ఒక మతం పై కావాలని దాడి చేస్తుంటే, ఈ ముఖ్యమంత్రి ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. జరుగుతున్న ఘటనల పై సిబిఐ ఎంక్వయిరీ చెయ్యాలని, అప్పుడే ఈ కుట్ర బయటకు వస్తుందని అన్నారు.