ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి గట్టి చురకలు అంటించారు. ఆస్తులపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నేతకు దిమ్మతిరిగే షాకిచ్చారు. వైయస్ జగన్, ఆయన పార్టీ నేతలు తమ పై మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్నారని మొదట వాళ్లు ఆస్తులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇతరులపై విమర్శలు చేసే ముందు మేం ఆ పని చేస్తున్నామా అని ఆలోచించాలన్నారు. ఆ తర్వాత తమ తప్పులు ఉంటే ఆరోపణలు చేయాలని అభిప్రాయపడ్డారు.
శుక్రవారం జగన్ కోర్ట్ లో ఉండగా, లోకేష్ అదిరిపోయే పంచ్ వేశారు.. వైయస్ జగన్ ఆస్తులను ఈడీ, సీబీఐ ప్రకటిస్తున్నాయని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ ఎప్పుడూ సొంతంగా ఆస్తులు ప్రకటించలేదన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు హెరిటేజ్ పైన 17 కేసులు వేశారని, కానీ ఒక్క దానిని నిరూపించలేకపోయారన్నారు. జగన్ పోలవరం అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, పోలవరం ఆగిపోవాలని కోరుకుంటున్నారని, కానీ పవన్ మాత్రం పోలవరం త్వరగా పూర్తి చేయాలని చెబుతున్నారని చెప్పారు.
మార్కెట్ వాల్యూ ప్రకారం ఆస్తుల విలువ మారుతూ ఉంటుందని, గత ఎనిమిదేళ్లుగా ఆస్తులను ప్రకటిస్తున్నామని ఆయన చెప్పారు. నాన్నగారి ఆస్తుల్లో ఎలాంటి మార్పు లేదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. మంత్రి లోకేశ్ ప్రకటించిన లెక్కల ప్రకారం ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలివి... చంద్రబాబు ఆస్తులు: రూ. 37 లక్షలు, అప్పులు రూ. 3.58 కోట్లు.. నారా లోకేశ్ ఆస్తుల విలువ: రూ. 15.20 కోట్లు.. నారా బ్రాహ్మణి ఆస్తులు: రూ. 15 కోట్లు... నారా దేవాన్ష్ ఆస్తులు: రూ. 11.54 కోట్లు