తెలంగాణలో ప్రజాకుటమికి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని, ఈ నెల 11న వచ్చే ఫలితం కూడా అదేనని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. ఇంటింటికీ కుళాయి ఇచ్చాకే ఓట్లు అడుగుతానన్న సీఎం కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. కొన్నిచోట్ల కుళాయిలు ఇచ్చి అందులో నీటి సరఫరా మరిచారని ఎద్దేవా చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నగరాన్ని డల్లాస్‌గా చేస్తామని సినిమా చూపించారని, స్కై వేలు, ఫ్లై ఓవర్ల ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. చంద్రబాబు చేసిన అభివృద్ధే హైదరాబాద్‌లో ఇప్పటికీ ఉందితప్ప కొత్తగా చేసిందేమీ లేదని విమర్శించారు.
అవసరమైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ఇటీవల కేటీఆర్ హెచ్చరించిన నేపథ్యంలో.. కేటీఆర్ నిర్భయంగా ఆంధ్రాలో ప్రచారం చేసుకోవచ్చని, అంతటి ప్రశాంతమైన వాతావరణం తమ వద్ద ఉందని లోకేశ్ అన్నారు. గడిచిన నాలుగున్నరేళ్లలో ప్రజలకు చెప్పుకోవడానికి ఒక్క పని కూడా తెలంగాణలో తెరాస చేయలేదని విమర్శించారు. తెలంగాణలో చెప్పుకోదగ్గ పరిశ్రమ ఒక్కటైనా కేసీఆర్ చెప్పగలరా? అని లోకేశ్ ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిని చంద్రబాబు ఎక్కడ అడ్డుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానంటే చంద్రబాబు అడ్డుపడ్డారా? దళితులకు మూడెకరాల భూమి ఇస్తానంటే అడ్డుకున్నారా? అని దుయ్యబట్టారు.
అభివృద్ధి చేయడం చేతకాక చంద్రబాబును విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. మళ్లీ గెలిపిస్తే సచివాలయానికి వస్తా అని కేసీఆర్ చెప్పుకోవడమే ఆయన పనితీరుకు అద్దం పడుతోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎవరైనా రావొచ్చని, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందని, అక్రమ అరెస్టులు, రౌడీయిజం ఉండవని లోకేష్ అన్నారు. రేవంత్‌రెడ్డి అరెస్టుపై ప్రశ్నించగా.. అలాంటి అప్రజాస్వామ్య విధానాన్ని ప్రజలు సహించరన్నారు. మళ్లీ గెలిపిస్తే రోజూ సచివాలయానికి వస్తాననడం కేసీఆర్ పనితీరుకు నిదర్శనమని విమర్శించారు. తెలంగాణలో ప్రజాకూటమి గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు.