రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కి , హామీలు నెరవేర్చకుండా, మోడీ ఏపీకి వెన్నుపోటు పొడిచారని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. అన్నిరంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తన కుట్రలు, కుతంత్రాలు కూడా ఏమీ చేయలేకపోవడంతోనే తనపై అక్కసు వెళ్లగక్కుతున్నారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. జన్మభూమి సభలో పాల్గొనేందుకు కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గం ముష్టికుంట్ల గ్రామం వచ్చిన మంత్రి.. ప్రధాని మోడీ తనపై చేసిన వ్యాఖ్యలకు ఘాటుగానే సమాధానం ఇచ్చారు. `కృష్ణా జిల్లా వారి మనుమడిని..అల్లుడ్ని.` అంటూ ప్రసంగం ఆరంభించారు లోకేష్. ``నాకు ఊహ తెలిసేసరికి మా తాత విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మహానాయకుడు నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రి అని, తాను చెడ్డీలు వేసుకునేటప్పటికే తన తండ్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్‌ని ప్రపంచ పటంలో పెట్టారని చెబుతూ తన ఘనమైన రాజకీయ వారసత్వాన్ని సభికులకు వివరించారు. తాత ఆశయం, తండ్రి అడుగుజాడల్లో ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లో ప్రవేశించి... గ్రామాలను అభివృద్ధి చేయడమే తాను చేసిన తప్పా? అని ప్రశ్నించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రపంచమే ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ప్రగతి మార్గంలో పయనింపజేయడమే నేను చేసిన నేరమా? అని నిలదీశారు. ప్రధాని మోడీ అధికారంలోకొచ్చేటప్పుడు అవినీతిపరుల భరతం పడతానని ప్రగల్భాలు పలికారని, అయితే అవినీతిపరుల్ని తన చంకనెక్కించుకుని అభివృద్ధికారకులను లక్ష్యంగా దాడులు చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు.
మోడీ అవినీతిపరుల్ని అరెస్ట్ చేయాలంటే..దొంగబ్బాయి ఆయన పక్కనే ఉన్నాడని ..ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. అన్నిరంగాల్లో అభివృద్ది పథంలో పయనిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ని ఎలాగైనా దెబ్బకొట్టాలనే లక్ష్యంతో తనపైనా, సీఎం చంద్రబాబుపైనా లేనిపోని ఆరోపణలు చేస్తూ..కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబుని రోజూ తిట్టే జగన్ ఆంధ్రప్రదేశ్‌కి అడుగడుగునా అన్యాయం చేస్తున్న మోడీని పల్లెత్తుమాట కూడా ఎందుకు అనడని ప్రశ్నించారు. ``అసెంబ్లీకి తాను రాకుండా, తన పార్టీ ఎమ్మెల్యేలను రానివ్వని దొంగబ్బాయి..ఠంచనుగా జీతాలు, అలవెన్సులు మాత్రం తీసుకుంటున్నారని ఎద్దేవ చేశారు. ప్రజాసమస్యలపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసే పని మానేసి..డ్రామాలాడుతున్నారని విమర్శించారు. మొన్నటివరకూ ప్రత్యేక హోదా కోసమంటూ రాజీనామా నాటకం రక్తి కట్టించగా, మోడీ ఇంట్లో విజయసాయిరెడ్డి కనిపించడంతో ఇది రాజీనామా కాదు.. రాజీడ్రామా అని ప్రజలకు తెలియడంతో మరో కొత్త నాటకానికి తెరలేపారని ఎద్దేవ చేశారు. లేని సానుభూతి రప్పించుకునేందుకు కోడికత్తి డ్రామా ఆడితే...చివరికి ఆ కత్తి వీరుడు వైసీపీ కార్యకర్తే అని తేలడంతో...తమను ఆడిస్తున్న ఢిల్లీ మోడీషాల నేతృత్వంలో కోడికత్తి కేసును ఎన్ఐఏకి అప్పగించడం వెనుక కుట్రలు ప్రజలు గమనిస్తున్నారని లోకేష్ పేర్కొన్నారు. ఇక ముచ్చటగా మూడోది... ఆవు, అంబులెన్స్ డ్రామాతో జగన్ ఎలా అభాసుపాలయ్యారో లోకేష్ వివరించారు.
తన పాదయాత్రలో వచ్చిన అంబులెన్స్, ఆవూ చంద్రబాబు కుట్రని ఆరోపించిన దొంగబ్బాయి...చివరికి తన యాత్రకు వచ్చి గాయపడిన వైసీపీ కార్యకర్తను ఆస్పత్రికి తరలించేందుకు వచ్చిన అంబులెన్స్ అని తెలిసినా..ఇదే డ్రామా కొనసాగించడం, ఆయన కుట్ర రాజకీయాలకు నిదర్శనమని లోకేష్ విమర్శించారు. కుల, మత, ప్రాంతాల పేరుతో ఏపీలో చిచ్చు రగిలించేందుకు దొంగబ్బాయి ఢిల్లీ పెద్దలతో కలిసి పన్నుతున్న కుట్రలు, తెలుగువారి ఐక్యత ముందు కొట్టుకుపోతాయని హెచ్చరించారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు పోరాడితే కేసులు, ఐటీ,ఈడీ దాడులతో బెదిరిస్తున్నారని, ఇటువంటి దాడులకు బెదిరే ప్రసక్తే లేదన్నారు. ఎస్‌పి, బీఎస్పీ పొత్తు ఖరారైన నేపథ్యంలో అఖిలేష్‌యాదవ్‌పై సీబీఐ కేసులు బనాయించారని లోకేష్ ఆరోపించారు. సోము వీర్రాజుతో ముఖ్యమంత్రి చంద్రబాబును తెలుగులో తిట్టించి...హిందీలో అనువదించుకుని మరీ రాక్షసానందం పొందుతున్న మోడీ...నీ కుట్రలు తెలుగువారి ముందు సాగవంటూ హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, బీజేపీ నేతలు కలిసి ఓట్లడిగేందుకు వస్తారని..వారిని సాదరంగా ఆహ్వానించి భోజనం పెట్టి...ఏపీకి ప్రత్యేక హోదా ఎప్పుడు ఇస్తారని నిలదీయాలని లోకేష్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఏపీలో 25 ఎంపీ సీట్లు తెలుగుదేశం గెలుచుకునేలా మీరంతా కృషి చేస్తే ..దేశప్రధానిని మన సీఎం చంద్రబాబే ఎంపిక చేసి.. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలన్నీ సాధించుకోవచ్చని సూచించారు. వేలాది మంది కార్యకర్తలు ఎంతో క్రమశిక్షణతో వ్యవహరించినందుకు ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు అంటూ మంత్రి నారా లోకేష్ తన ప్రసంగాన్ని ముగించారు.