మంగళగిరిలో శుక్రవారం ఓ కార్యక్రమానికి హాజరైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు తనశైలికి భిన్నంగా కాస్తా వ్యంగ్యంగా, ఇంకాస్తా ఘాటుగానే సమాధానాలిచ్చారు. మీడియా ప్రతినిధి- లోకేశ్ గారూ! పార్టీ నుంచి వెళ్లినవాళ్లు, వైకాపా మంత్రులు మిమ్మల్నే ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? నారా లోకేశ్- విరగకాచే చెట్లపైకే కదా! ఎవరైనా రాళ్లు విసురుతారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమం చూస్తూనే, పార్టీ జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ..మంత్రిగా ఎవరూ చేయని అభివృద్ధి చేశాను. సమర్థుడిని కాబట్టే నన్ను టార్గెట్ చేసి, నా ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని చూస్తారు. చంద్రబాబు గారిని వీళ్ళు ఏమి అనలేరు, అందుకే నా మీద పడతారు.. క్రమశిక్షణగలిగిన 70 లక్షల మంది తెలుగుదేశం కార్యకర్తల సైన్యం సిద్ధంగా ఉంది. ఢీ అంటే ఢీ..రేప్పొద్దున ప్రభుత్వంలోకి వచ్చేది మేమే. మీడియా ప్రతినిధి- రాజధాని ప్రాంత పరిధిలో మీకు భూములున్నాయని వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలపై మీ స్పందనేంటి?
నారా లోకేశ్- జగన్ అధికారంలోకొచ్చి ఆరు నెలలైంది. మంత్రులు, అధికారులను రంగంలోకి దింపి..చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నేతలు ఎక్కడ దొరుకుతారా? అని తవ్వుతూనే ఉన్నారు. నాకు ఐదొందల ఎకరాలున్నాయన్నారు.. ఇప్పుడు అరసెంటు భూమి ఉందని నిరూపించలేకపోయారు. అంత చేతగానివాళ్లా! దద్దమ్మలా! ఈ పాలకులు? మీడియా ప్రతినిధి- రాజధానిపై రోజుకో మాట ప్రభుత్వం చెబుతోంది.. ఉంటుందా? తరలిపోతుందా? నారా లోకేశ్- రాజధాని ఉండాలా అని ఒకరు.. ఇప్పుడున్న రాజధానిని 50 కిలోమీటర్లు అటు జరపాలని మరొకరు, కాదు కాదు 30 కిలోమీటర్లు ఇటు జరపాలని మరొక మంత్రి అంటున్నారు. రాజధాని ఏమైనా కారా? అటు 50 కిలోమీటర్లు, ఇటు 30 కిలోమీటర్లు తీసుకుపోవడానికి?
మీడియా ప్రతినిధి- రోజుకో పరిశ్రమ తరలిపోతోందని వార్తలొస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? నారా లోకేశ్- టీడీపీ హయాంలో ఎన్నో కష్టనష్టాలకోర్చి తీసుకొచ్చిన పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి పో..పో..అని చీదరించుకుని పొమ్మంటున్నారు. వెనువెంటనే తెలంగాణ పాలకులు రా..రా..రమ్మంటూ ఆ పరిశ్రమలను తీసుకుపోతున్నారు. మీడియా ప్రతినిధి - రాజధాని ఉంటుందా? తరలిపోతుందా? నారా లోకేశ్-రాజధాని ప్రాంతంలో ఒకే కులానికి భూములున్నాయని ఒక సారి, ఇన్సైడర్ ట్రేడింగ్ అని మరోసారి అంటున్నారు. రాజధాని ఇక్కడి నుంచి తరలించాలనే ఆలోచనతోనే జగన్ ఇటువంటి గందరగోళ ప్రకటనలు చేస్తున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్న జగన్ మోహన్ రెడ్డి ఇటువంటి వైట్‌కాలర్ నేరాల్లో ఆరితేరారు. ఆ అనుమానంతోనే ఆయన రాజధాని తరలింపు యోచనలో ఉన్నారు. దీనికోసం ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు.