బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావుకు సవాల్ చేసిన తర్వాతైనా తన పై చేసిన ఆరోపణలకు సంబంధించి పేర్లు బయటపెడతారని వేచి చూస్తే మళ్లీ అసత్య ఆరోపణలు చేసి పారిపోయారని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. నిన్న లోకేష్ చేసిన ఛాలెంజ్ కు, జీవీఎల్ వెరైటీగా స్పందించారు. లోకేష్ నీకు, నాకు రిప్లై ఇవ్వటానికి 36 గంటలు పట్టింది, నువ్వు అడుగుతున్న పేరు త్వరలోనే చెప్తా అంటూ ట్వీట్ చేసారు. దీనికి లోకేష్ ఈ రోజు ఉదయం కౌంటర్ ఇచ్చారు. "జీవీఎల్ గారూ, గుడ్ మార్నింగ్. నేను స్పందించడానికి 36 గంటలు పట్టింది. ఇన్వెస్ట్ మెంట్లకు సంబంధించిన అగ్రిమెంట్లపై సంతకాలు చేయడంలో నేను బిజీగా ఉండటమే దీనికి కారణం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహకారం లేకుండానే ఇవన్నీ మేము చేస్తున్నాం. ఏవో పేర్లు బయటపెడతానని చెప్పారు. ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారు? మీ క్రియేటివిటీ ఏమైంది ? మీరు పేర్లు ప్రకటించే ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం ఎదురు చూస్తున్నా" అంటూ ట్వీట్ చేశారు.
అసలు వివాదం ఇది... బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు, మంగళవారం మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని, తనకు కమీషన్లు వచ్చే అభివృద్ధి పనులకు మాత్రమే అంగీకారం తెలుపుతున్నారని ఆరోపించారు. టీడీపీతో కలిసి ఉండడం వల్ల రాష్ట్రంలో తమ పార్టీ చాలా కోల్పోయిందని అన్నారు. రాజకీయ బ్రోకర్లు, కాంట్రాక్టర్ బ్రోకర్లను ఏదో ఒక పని పేరుతో తరచూ తన వద్దకు పంపవద్దంటూ ఒక కేంద్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఆయన కుమారుడు నారా లోకేశ్‌కు స్వయంగా చెప్పారంటే రాష్ట్రంలో అవినీతి విలయ తాండవాన్ని అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. సొంత పనుల కోసం వచ్చే బ్రోకర్లను తన వద్దకు పంపవద్దని లోకేశ్‌కు కేంద్ర మంత్రి చెప్పారని గుర్తుచేశారు.
జీవీఎల్ చెప్పిన అబద్ధాల పై, లోకేష్ ట్విట్టర్ లో స్పందించారు. జీవీఎల్ నరసింహారావుకు సవాల్ విసిరారు ఏపీ ఐటీ మంత్రి లోకేశ్. దమ్ముంటే తన ప్రశ్నలకు సమాధానాలివ్వాలని ట్విట్టర్ వేదికగా కోరారు. కేంద్రమంత్రి దగ్గరకు బ్రోకర్‌ను పంపానంటున్న జీవీఎల్... ఆ కేంద్రమంత్రి పేరు, బ్రోకర్ పేరును బయటపెట్టాలన్నారు. సహజంగా మనుషులు రెండు రకాలు ఉంటారని, ఒకటి నిజాలు చెప్పే వారు అయితే, అబద్ధాలను నిజమని నమ్మించే వారని అన్నారు. జీవీఎల్, అబద్ధాలను నిజమని నమ్మించే రకమని మండిపడ్డారు. . ఢిల్లీలో లాబీయింగ్ అంటూ మరో కట్టుకథ మొదలుపెట్టారని విమర్శించారు. అసత్యాలను ప్రచారం చేయడం బీజేపీ నేతలకు జబ్బుగా మారిందని లోకేశ్ ఎద్దేవా చేశారు. దీని పై జీవీఎల్ స్పందిందిస్తూ త్వరలోనే ఆ పేరు చెప్తా అని చెప్పటంతోనే, జీవీఎల్ చెప్పేవి అబద్ధం అని తెలిసిపోతుంది.