యువగళం పాదయాత్ర రాయలసీమలో సాగుతోంది. ఇప్పటివరకూ ఏ నియోజకవర్గం వెళితే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే, వైసీపీ నేతల అవినీతిని ఆధారాలతో సహా ప్రజలముందుంచి మరీ సవాల్ విసరుతున్నారు నారా లోకేష్. పెద్దిరెడ్డి ఇలాఖా..అంటే పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాలలో లోకేష్ రెచ్చిపోయారు. పాపాల మిధున్ రెడ్డి సన్నాఫ్ పాపాల పెద్దిరెడ్డీ చిత్తూరు జిల్లాకు ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. రేపు తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఉంటా...దమ్ముంటే రావాలంటూ ఎంపి మిథున్ రెడ్డికి యువనేత లోకేష్ సవాల్ విసిరారు. ``చిత్తూరు జిల్లా అభివృద్ధికి మేము నిధులు కేటాయించాం... ఫాక్స్ కాన్, సెల్ కాన్ వంటి పరిశ్రమలు తెచ్చి వేలాదిమంది యువతకు ఉద్యోగాలిచ్చాం. పుంగనూరులో రోడ్లకు నిధులు మంజూరుచేసింది కూడా నేను పంచాయితీరాజ్ మంత్రిగా పనిచేసే సమయంలోనే. చిత్తూరును పెద్దిరెడ్డి కుటుంబం నమిలేస్తోంది. ఒకరికి ముగ్గరు ప్రజాప్రతినిధులు ఉన్న పెద్దిరెడ్డి అండ్ కో మదనపల్లిని ఎందుకు జిల్లా చేయలేదు? ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీగా పెద్దిరెడ్డి కుంటుంబం ఉంది. జిల్లా వాళ్ల చేతిలో ఉండాలని మదనపల్లిని జిల్లా కాకుండా అడ్డుకున్నారు అని ఆరోపించారు. మదనపల్లికి మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అధికారిక ఎమ్మెల్యే నవాజ్ బాషా అయితే అనధికార ఎమ్మెల్యేలు పాపాల పెద్దిరెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి. తమిళనాడు రిజిస్ట్రేషన్ తో చేసిన లారీలతో ఇక్కడ కొండలను తవ్వి గ్రావెల్ తరలిస్తున్నారు. దళితులకు చెందిన డీకేటీ భూములు లాక్కుని మైనింగ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే నవాజ్ బాషా తన బినామీలతో బెంగళూరు బస్టాండ్ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్ నుండి నెలకు ఐదు లక్షలు వసూలు చేస్తున్నాడు. మదనపల్లి పట్టణంలో నవాజ్ బాషా తన అనుచరులతో వెంచర్లు వేస్తున్నాడు. ప్రభుత్వ భూమి పక్కనే ఉండేలా ప్రేవేటు స్థలాల్లో వెంచర్లు వేస్తూ ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నాడు.
నవాజ్ బాషా, అనుచరులు కలసి ప్రభుత్వానికి చెందిన 40 ఎకరాల్లో లేఅవుట్లు వేసి రూ.100 దోచుకున్నారు. మదనపల్లిలో లే అవుట్ వేయాలంటే కప్పం కట్టాలి. 557 ఎకరాలు ఉన్న సీటీఎం చెరువును స్థానిక ఎమ్మెల్యే, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి అనుచులు 40 ఎకరాలు కాజేశారు. కరోనా వస్తే షాపులు, రెస్టారెంట్లు, బంగారం కొట్ల నుండి రూ.4కోట్లు వసూలు చేశారు. వలసపల్లి దగ్గర జ్యూస్ ఫ్యాక్టరీకి చెందిన మూడెకరాల భూమిని ఎమ్మెల్యే నవాజ్ బాషా లారీ ఓనర్స్ అసోషియేషన్ పేరు చెప్పి రూ.12కోట్లు విలువు చేసే భూమిని లాక్కున్నారు. బసినికొండ రోడ్డులో అగ్గిపెట్టె పరిశ్రమ కార్మికులకు చెందిన రూ.20 కోట్ల విలువైన రెండెకరాల భూమిని ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆక్రమించారు. నిమ్మనపల్లిలోని బహుదా నది నుండి రోజూ 100 టిప్పర్ల ఇసుక బెంగుళూరుకు వెళ్తోంది. మదనపల్లిలో క్వారీలు చేయాలంటే పాపాల పెద్దిరెడ్డికి 50 శాతం కమిషన్ ఇవ్వాలి. ఘన చరిత్ర ఉన్న బీటీ కాలేజీకి చెందిన 40 ఎకరాల భూమిని కూడా స్వాహా చేసే ప్రయత్నం చేస్తున్నారు. 2024 నాటికి దొరికిన భూమి, కొండలు, చెరువులు కూడా స్వాహా చేస్తారు. మదనపల్లికి పరిశ్రమలు రాకపోవడానికి కారణం పెద్దిరెడ్డి కుటుంబమే. వాళ్ల కుటుంబాన్ని తరిమికొట్టండి. `` అని లోకేష్ పిలుపునిచ్చారు. నారా లోకేష్ తమ ఫ్యామిలీపై చేసిన అవినీతి ఆరోపణలపై స్పందించలేదు ఎంపీ మిధున్ రెడ్డి. అభివృద్ధిపై చర్చకి రావాలని లోకేష్ సవాల్ విసిరితే, లోకేష్‌కి దమ్ముంటే చిత్తూరు జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ప్రతి సవాల్ విసరడం తోకముడిచినట్టేనని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.