ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కొత్త విశేషాలకు నాంది పలికాయి. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో ఒక్కచోట కూడా ప్రధాన రాజకీయ పార్టీల తరుఫున గత ఎన్నికల్లో పోటీపడిన ప్రత్యర్థులు ఈసారి మళ్లీ తలపడటం లేదు. ఎపిలోని లోక్‌సభ స్థానాల్లో అంతా కొత్త ప్రత్యర్థులు ఉండడం విశేషం. ఈ ఎన్నికల్లో జనసేన, సిపిఎం, సిపిఐ, బిఎస్‌పి కూటమి అభ్యర్థులు కూడా రంగంలో ఉండడం వల్ల, కొత్త అభ్యర్థుల పోటీ సహజమే అని భావించినా, టిడిపి, వైసిపి, కాంగ్రెస్ కూడా ఎక్కువగా కొత్త వారికే టికెట్లు ఇచ్చాయి. రాజంపేట, కడప లోక్‌సభ స్థానాల్లో మినహా మిగిలిన 23 చోట్లా వైసిపి కొత్తవారిని పోటీలో నిలిపింది. టిడిపి 15 స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, హిందూపురం, చిత్తూరు నియోజకవర్గాల్లో పాత అభ్యర్థులే బరిలో ఉన్నారు. మిగిలిన అన్ని చోట్లా కొత్త అభ్యర్థులను పోటీకి దింపింది. లోక్‌సభ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి బరిలో నిలిచిన 320 మంది అభ్యర్థుల్లో 25 మంది మహిళలు, 295 మంది పురుషులు ఉన్నారు. వారిలో సీనియర్లు పది శాతం మంది మాత్రమే ఉన్నారు.
శ్రీకాకుళంలో పోటీ పడుతున్న కింజరాపు రామ్మోహన్‌నాయుడు (టిడిపి), దువ్వాడ శ్రీనివాస్ (వైసిపి), విజయనగరంలో పోటీకి నిలిచిన అశోక్ గజపతిరాజుకు (టిడిపి), బెల్లాన చంద్రశేఖర్ (వైసిపి), విశాఖపట్నం టిడిపి అభ్యర్థి ఎం.భరత్, వైసిపి అభ్యర్థి ఎం.వి.వి.సత్యనారాయణ, జనసేన అభ్యర్థి వి.వి.లక్ష్మీనారాయణలకు ఇవే తొలి ఎన్నికలు. అనకాపల్లిలోనూ అదే పరిస్థితి ఉంది. ఇక్కడ ఆడారి ఆనంద్ (టిడిపి), డాక్టర్ బి.వి.సత్యవతి (వైసిపి), చింతల పార్థసారథి (జనసేన) తొలిసారిగా పోటీ చేస్తున్నారు. కాకినాడలో పోటీలో ఉన్న చలమలశెట్టి సునీల్ (టిడిపి), వంగా గీత (వైసిపి), జ్యోతుల వెంకటేశ్వరరావు (జనసేన)లకు ఇవే మొదటి లోక్‌సభ ఎన్నికలు. అమలాపురంలో పోటీ పడుతున్న గంటి హరీశ్‌మాధుర్ (టిడిపి), చింతా అనురాధ (వైసిపి), డిఎంఆర్ శేఖర్ (జనసేన) తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల బరిలో దిగారు. రాజమహేంద్రవరం నుంచి గత ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన మాగంటి మురళీమోహన్ స్థానంలో ఆయన కోడలు రూపాదేవిని టిడిపి పోటీకి నిలిపింది. నర్సాపురంలో పోటీపడుతున్న వేటుకూరి శివరామరాజు (టిడిపి), రఘురామ కృష్ణంరాజు (వైసిపి), కొణిదెల నాగబాబు (జనసేన) కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. ఏలూరులో టిడిపి నుంచి మాగంటి బాబు గతంలో కూడా ఎన్నికల్లో పాల్గొన్నారు. కోటగిరి శ్రీధర్ (వైసిపి), పెంటపాటి పుల్లారావు (జనసేన) మొదటిసారి లోక్‌సభ ఎన్నికల గోదాలో దిగారు. మచిలీపట్నంలో కొనకళ్ల నారాయణరావు (టిడిపి), బాలశౌరి (వైసిపి), బండ్రెడ్డి రామకృష్ణ (జనసేన)లలో టిడిపి అభ్యర్థి గతంలో పోటీ చేశారు.
విజయవాడలో కేశినేని నాని (టిడిపి), పొట్లూరి వరప్రసాద్ (వైసిపి), ముత్తంశెట్టి లక్ష్మణ శివప్రసాద్‌బాబు (జనసేన)లలో నాని ఇంతకు ముందు ఎన్నికల్లో కూడా పాల్గొన్నారు. మిగిలిన ఇద్దరూ కొత్తవారు. గుంటూరులో టిడిపి అభ్యర్థి గల్లా జయదేవ్ గత ఎన్నికల్లో పాల్గొన్నారు. మోదుగుల వేణుగోపాలరెడ్డి (వైసిపి), బి.శ్రీనివాస్ (జనసేన) కొత్తవారు. నరసరావుపేటలో రాయపాటి సాంబశివరావు (టిడిపి), లావు కృష్ణదేవరాయులు (వైసిపి), నయూబ్ కమాల్ (జనసేన) తలపడుతున్నారు. వారిలో రాయపాటి సాంబశివరావు ఇంతకు ముందు ఎన్నికల్లో పోటీ చేశారు. బాపట్లలో పోటీకి నిలిచిన శ్రీరాం మాల్యాద్రి (టిడిపి), నందిగం సురేశ్ (వైసిపి), కె.దేవానంద్ (బిఎస్‌పి)లలో టిడిపి అభ్యర్ధి గత ఎన్నికల్లో కూడా లోక్‌సభ బరిలో ఉన్నారు. ఒంగోలు నుంచి పోటీ చేస్తున్న శిద్దా రాఘవరావు (టిడిపి), మాగుంట శ్రీనివాసరెడ్డి (వైసిపి), బెల్లంకొండ సాయిబాబు (జనసేన) కొత్త ప్రత్యర్థులే. నంద్యాలలో పోటీలో ఉన్న మాండ్ర శివానంద్‌రెడ్డి (టిడిపి), పి.బ్రహ్మానందరెడ్డి (వైసిపి), ఎస్పీవై రెడ్డి (జనసేన) కొత్త ప్రత్యర్థులు. ఎస్పీవై రెడ్డి ఇంతకుముందు కూడా పోటీ చేశారు. కర్నూలు నుంచి పోటీలో ఉన్న కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి (టిడిపి), డాక్టర్ సంజీవ్ కుమార్ (వైసిపి), కె.ప్రభాకర్‌రెడ్డి (సిపిఎం) కొత్త ప్రత్యర్థులే. ప్రస్తుత టిడిపి అభ్యర్థి గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. అనంతపురంలో జెసి పవన్‌కుమార్‌రెడ్డి (టిడిపి), తలారి రంగయ్య (వైసిపి), జగదీశ్ (సిపిఐ), హిందూపురంలో పోటీ చేస్తున్న నిమ్మల కిష్టప్ప (టిడిపి), గోరంట్ల మాధవ్ (వైసిపి), కరీముల్లా ఖాన్ (జనసేన), కడపలో ఆదినారాయణరెడ్డి (టిడిపి), వై.ఎస్.అవినాశ్‌రెడ్డి (వైసిపి), జె.ఈశ్వరయ్య (సిపిఐ) కొత్త ప్రత్యర్థులే. నెల్లూరు నుంచి పోటీ పడుతున్న బీద మస్తాన్‌రావు (టిడిపి), అదాల ప్రభాకర్‌రెడ్డి (వైసిపి), చండ్ర రాజగోపాల్ (సిపిఎం) కొత్త ప్రత్యర్థులు కావడం విశేషం. తిరుపతిలో పనబాక లక్ష్మి (టిడిపి), మినహా బల్లి దుర్గాప్రసాద్ (వైసిపి), డి.శ్రీహరిరావు (జనసేన) కొత్త ప్రత్యర్థులుగానే తలపడుతున్నారు. రాజంపేట నుంచి పోటీ చేస్తున్న టిడిపి అభ్యర్థి డి.సత్యప్రభ, పివి.మిధున్‌రెడ్డి (వైసిపి), సయ్యద్ ముకరం చాంద్ (జనసేన) తరహాలోనే చిత్తూరులో ఎన్.శివప్రసాద్ (టిడిపి), మినహా రెడ్డప్ప (వైసిపి), పుణ్యమూర్తి (జనసేన) కొత్త ప్రత్యర్థులుగానే లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్నారు.