కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు విజ్ఞాన్ భవన్‌కు బయలుదేరారు. మరికొద్దిసేపట్లో 17వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా 543 ఎంపీ స్ధానాలకు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్ధానాలకు షెడ్యూల్ విడుదల కానుంది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది. 16వ లోక్ సభకు 9 విడతల్లో ఎన్నికలు జరిగాయి. 17వ లోక్ సభకు 7-8 విడతల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. మొదటి రెండు విడతల్లో అస్సాం, త్రిపుర సహా ఈశాన్య రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించే అవకాశమున్నట్లు సమాచారం. మూడవ విడతలో బిహార్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, జమ్మూ కశ్మీర్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, యూపీలో ఎన్నికలు జరగనున్నాయి.
అత్యధికంగా యూపీ, బీహార్లో 6 దశల్లో ఎన్నికలు ఉండే అవకాశముంది. పశ్చిమబెంగాల్‌లో 5 దశల్లో ఎన్నికలు జరిగే అవకాశమున్నట్లు తెలియవచ్చింది. ఏపీ తెలంగాణలో 7,8 విడతల్లో ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం. ఐదవ విడతలో అత్యధికంగా లోక్ సభ స్ధానాలకు ఎన్నికలు జరిగే అవకాశముంది. వివిపాట్ యంత్రాలలో ఉన్న స్లిప్పుల లెక్కింపుపై ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భంగా ఈసీ నిర్ణయంపై ఉత్కంఠత కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించనున్నారు. పోలింగ్ తేదీలు, ఎన్ని దశల్లో ఎన్నికల నిర్వహణ వివరాలను సీఈసీ సునీల్ అరోడా ప్రకటించనున్నారు.
ఏప్రిల్, మే నేలల్లో 7 లేదా 8 విడతల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ మొదటి వారంలో తొలి విడత పోలింగ్ ఉండనున్నట్లు సమాచారం. తొలి విడత పోలింగ్‌కు ఈ నెలాఖరున నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. జూన్3తో ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి ముగియనుంది. మరోవైపు, నోటిఫికేషన్ విడుదలవుతున్న సమయం గురించి దక్షిణాది నేతలు టెన్షన్ పడుతున్నారు. సాయంత్రం 4.30 గంటల నుంచి 6 వరకు రాహు కాలం ఉండటమే దీనికి కారణం. మన దక్షిణాది నేతలు వాస్తు, జ్యోతిష్యం, పంచాగాన్ని ఎంతో నమ్మకంగా పాటిస్తారనే సంగతి తెలిసిందే. దేవేగౌడ, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, యెడ్యూరప్పలకు కూడా వీటిపై నమ్మకం చాలా ఎక్కువే. రాహు కాలంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుండటం పట్ల నేతలు కలవరపాటుకు గురవుతున్నారు.