‘‘ఒక పార్టీ చేసిన ఫిర్యాదును బట్టి, ఎలాంటి స్వతంత్ర విచారణ లేకుండా, సంబంధిత అధికారుల వివరణ తీసుకోకుండా.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని అడగకుండా.. ఎన్నికల సంఘం ఏకపక్షంగా ఏపీ ఉన్నతాధికారులను బదిలీ చేసిందని వార్తలు వస్తున్నాయి.. అదే నిజమైతే కచ్చితంగా అపశ్రుతి దొర్లినట్లే’’ అని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. ‘ఎన్నికల సంఘానికి స్వయంప్రతిపత్తి ఉంది.. ప్రజలు, పార్టీలు, పత్రికలు దానికి మద్దతునిస్తున్నాయి. కోర్టులు అసాధారణ సమయాల్లో తప్ప జోక్యం చేసుకోకుండా గౌరవమిస్తున్నాయి. దాన్ని కాపాడుకోకుండా ఎవరో చేసిన ఫిర్యాదును బట్టి అధికారులపై చర్యలు తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి లేదు’ అని అభిప్రాయపడ్డారు.
రాజ్యాంగం ఇచ్చిన విచక్షణాధికారాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుకుంటాం. మేమే రాజులం.. చక్రవర్తులం ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటే పొరపాటని, కచ్చితంగా ప్రజాస్వామ్యానికి, న్యాయ వ్యవస్థకు జవాబు దారీతనంగా ఉండాల్సిందేనన్నారు. ప్రభుత్వ అధికారుల వివరణ తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తికి, ప్రజాస్వామ్యానికి, ఎన్నికల నిర్వహణకు ప్రమాదకరం అన్నారు. ఇప్పటికైనా పొరపాటును సరిదిద్దుకోవాలని సూచించారు. ఘటనపై స్వతంత్ర విచారణ చేసి, పారదర్శక నిర్ణయం తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన తన నివాసంలో ‘ఈనాడు-ఈటీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో మాట్లాడారు.
ఈవీఎంలు, వీవీప్యాట్‌లు బాగానే పనిచేస్తున్నాయి. పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నాయన్న దానికి ఆధారాల్లేవు. ఆ భయాన్ని వదిలేసి.. ఎన్నికల నిర్వహణపై నమ్మకాన్ని పెంచుకోవాలి. ఇదే సమయంలో అనుమానాలున్న చోట కనీసం 5-10శాతం వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కించాల్సిన అవసరం ఉంది. ఆచరణ సాధ్యమైతే ఎన్నికల సంఘం ఈ విషయంలో ముందుకు వస్తుందనే నమ్ముతున్నా. ఓడిపోయిన ప్రతి పార్టీ ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నాయి. అదే యంత్రాలతో మళ్లీ గెలుస్తున్నారంటే వాటిని ట్యాంపర్ చేయడానికి వీలులేదనే విషయం స్పష్టం అవుతుంది.