ఎన్నికల వేళ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు తైనాల విజయ్‌కుమార్ ఆ పార్టీకి శనివారం రాజీనామా చేశారు. అనంతరం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ పరిణామం నగరంలో వైసీపీ వర్గాలను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. మరో ఐదు రోజుల్లో పోలింగ్ జరగబోతున్న తరుణంలో సౌమ్యుడిగా పేరున్న తైనాల పార్టీని వీడడం, టీడీపీలో చేరడం ఉత్తర నియోజకవర్గంతోపాటు విశాఖ పార్లమెంట్ పరిధిలోని మిగిలిన నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపుతుందని రాజకీయ నేతలు విశ్లేషిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్‌తో పాటు అభ్యర్థుల నుంచి తనకు ఎదురవుతున్న అవమానాలను భరించలేకే తైనాల పార్టీని వీడినట్టు ప్రచారం జరుగుతోంది.
న్యాయవాది అయిన తైనాల విజయ్‌కుమార్ 2005లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. జీవీఎంసీ ఫలితాల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు సమానంగా సీట్లు రావడంతో తైనాల మద్దతు రెండు పార్టీలకు అవసరమైంది. ఆ సమయంలో తైనాల విజయ్‌కుమార్ నేరుగా అప్పటి సీఎం వైఎస్‌ను కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 సాధారణ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరినప్పటికీ టిక్కెట్ దక్కకపోవడంతో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషిచేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా నియమితులయ్యారు. మూడున్నరేళ్లపాటు పనిచేసిన అనంతరం ఆయన స్థానంలో అధిష్ఠానం మరొకరికి సమన్వయకర్త బాధ్యతలు అప్పగించింది.
టిక్కెట్ల కేటాయింపు తర్వాత తైనాల పట్ల పార్టీ అధ్యక్షుడు జగన్ ఎందుచేతనో కొంత అసహనం ప్రదర్శిస్తూ వచ్చినట్టు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. దీనిని గుర్తించిన కొంతమంది అభ్యర్థులు కూడా తైనాలను దూరం పెట్టడం మొదలుపెట్టారని సమాచారం. పార్టీ అధ్యక్షుడి హోదాలో ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనీసం ఫోన్ ఎత్తేవారు కాదని, అవహేళనగా మాట్లాడేవారని తెలిసింది. ఆ విషయాలను అక్కడున్న నేతలు తైనాలకు చెప్పడంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురైనట్టు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని జగన్‌ను కలిసి వివరించాలని తైనాల యత్నించినా ఆయన కనీసం పట్టించుకోలేదని వివరిస్తున్నారు. తాజాగా శుక్రవారం లోటస్‌పాండ్‌కు వెళ్లిన తైనాలకు తిరిగి అలాంటి అనుభవమే ఎదురవడంతో ఏమాత్రం గుర్తింపు లేని పార్టీలో ఇంకా కొనసాగడం వ్యర్థమని గుర్తించి, పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొంటున్నారు. దీనిని గుర్తించిన టీడీపీ నేతలు తైనాల విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి ఆయన్ను పార్టీలో చేరేలా పావులు కదిపారు. దాంతో తైనాల టీడీపీలో చేరిపోయారు.