రెండేళ్ల కిందట విజయవాడలో వైసీపీ ప్లీనరీ జరిగింది. అప్పుడో బహిరంగ సభ నిర్వహించారు. మళ్లీ నంద్యాల ఉప ఎన్నికలప్పుడు ఓ బహిరంగసభ నిర్వహించారు. అంతే ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభమైంది. రోడ్డు సైడ్ మీటింగ్‌లతోనే సరిపుచ్చారు. పాదయాత్ర ముగింపు సమయంలోనూ సాదాసీదాగా సభను ముగించారు. ఎన్నికల ప్రచారంలో తాము ముందున్నామని చెప్పుకోవడానికి రాజకీయ పార్టీలు... ఏదైనా అత్యంత ఘనంగా చేయడానికి ప్రయత్నిస్తుంటాయి. ముందుగా భారీగా సభలు నిర్వహిస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు ధర్మపోరాట దీక్షల పేరుతో నెలకో సభ నిర్వహిస్తూ పార్టీని ఎన్నికలకు సిద్ధం చేశారు. ఇప్పడు కూడా ప్రతిరోజు రోడ్‌షోలతో పాటు బహిరంగసభలు కూడా ఉండే విధంగా ప్రణాలికలు రచిస్తున్నారు. జాతీయ నేతల అందుబాటును బట్టి భారీ బహిరంగసభలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రచారంలో టీడీపీ ముందుందనే అభిప్రాయం ఏర్పడుతోంది.
ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత వైసీపీ తరుపున భారీ ప్రచార కార్యక్రమాలు పెట్టుకోలేదు. జగన్ హెలీకాప్టర్‌లో జిల్లాలకు వెళ్తున్నారు. రోజుకు మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో ప్రసంగిస్తున్నారు. కానీ అన్నీ రోడ్ సైడ్ మీటింగ్‌లే. నియోజకవర్గ కేంద్రాల్లో యాబై, అరవై అడుగుల రోడ్లలో సభలు పెడుతున్నారు. ఆ దారి నిండా కనిపించే జనంతోనే ప్రభంజనం అని సంతృప్తి పడుతున్నారు. కానీ తన పార్టీ రేంజ్ తెలిపేలా జిల్లా స్థాయి లేదా రాష్ట్ర స్థాయిలో ఓ బహిరంగ సభ పెట్టి బలపదర్శన చేయాలన్న ఆలోచన చేయడం లేదు. పాదయాత్ర ముగిసిన తర్వాత శంఖారావం పేరుతో బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశాలు పెట్టారు. ఇవి మూడు జిల్లాలకు అన్నట్లుగా పెట్టారు కానీ.. ఆయా నియోజకవర్గాల్లో మాత్రమే జనసేమీకరణ చేశారు. ఫలితంగా సభలు తేలిపోయిందన్న భావన వైసీపీలో ఏర్పడింది.
కాకినాడ సభలో ఆరువేల కుర్చీలను తెచ్చారు. నాలున్నర వేల కుర్చీలకు సరిపడా మాత్రమే జనం కనిపించారు. దీంతో 30 శాతానికి పైగా కుర్చీలు ఖాళీగా కనిపించాయి. ఇతర మీడియాకు కవర్ చేసుకునే అవకాశం ఇవ్వనప్పటికీ ఆ గ్రౌండ్ పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఉన్న వాళ్లు వీడియో తీసి నెట్‌లో పెట్టడంతో విషయం బయటపడిపోయింది. జనం రాకపోతే ప్రజల్లో ఉన్న మూడ్ తెలిసిపోతుందనే ఉద్దేశంతోనే జగన్ బహిరంగ సభల జోలికి వెళ్లడం లేదనే అభిప్రాయం ఇతర నేతల్లో ఉంది. జనసమీకరణ కోసం బాగా ఖర్చు పెట్టాల్సి ఉంటుందని, పైగా ఎండల్లో అది చాలా కష్టమని వైసీపీ శ్రేణులు కూడా తమ బాధ్యుల వద్ద వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. బహిరంగ సభ పెడితే రెండు మూడు రోజుల పాటు దానిపై దృష్టి కేంద్రీకరించాలని, భారీగా ఖర్చుకూడా పెట్టకోవాల్సి వస్తుందని, దీనివల్ల సమస్యలు వస్తాయని మరికొంతమంది లైట్‌గా తీసుకుంటున్నారు. దీంతో రోడ్ సైడ్ మీటింగ్‌లకే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే సమయంలో జగన్.. ప్రచారాన్ని అంత సీరియస్‌గా చేయడం లేదన్న అభిప్రాయం వైసీపీ శ్రేణుల్లో ఉంది. ఆయన మూడు నాలుగు రోజులకోసారి ప్రచారానికి విరామం ఇస్తున్నారు. రోజుకు నాలుగు చోట్ల ప్రసంగించిన తర్వాత మంగళవారం ఆయన లోటస్ పాండ్‌లో విశ్రాంతి తీసుకున్నారు. గత వారంలో కూడా ఓరోజు విరామిచ్చారు. జగన్ తీరుపై వైసీపీలో ఇతర పార్టీల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆశలు వదులుకున్నారు కాబట్టే ప్రచారాన్ని తేలిగ్గా తీసుకున్నారని మరికొందరు విశ్లేషిస్తున్నారు. మరికొందరు మాత్రం ఎలక్షనీరింగ్ వ్యూహాల కోసం లోటస్ పాండ్‌లో చర్చల్లో మునిగితేలుతున్నారని అంటున్నారు. ప్రశాంత్ కిషోర్ టీంతో తాజా పరిస్థితులను సమీక్షించి ఏయే నియోజకవర్గాల్లోని ఎలక్షనీరింగ్‌పై చర్చిస్తున్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి.