మే 23న ఫలితాలు ఎన్నికయ్యే వరకే చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం స్పష్టం చేశారు. చంద్రబాబునాయుడు 2014 జూన్ 8న ప్రమాణస్వీకారం చేశారు కాబట్టి, ఐదేళ్ల కాలం (2019 జూన్ 8) వరకు పదవిలో ఉంటారని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. ఈ క్రమంలో చీఫ్ సెక్రటరీ కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. హన్స్ ఇండియా పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఈ వ్యాఖ్యలు చేశారు. మే 23న వచ్చిన ఫలితాల్లో టీడీపీ ప్రభుత్వం మరోసారి ఎన్నిక కాకపోతే ఆయన వెంటనే దిగిపోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రేనని, అయితే, ఆయనకు ఎలాంటి అధికారాలు ఉండవని తేల్చి చెప్పారు.
చంద్రబాబుకు సమీక్షలు నిర్వహించే అధికారం లేదని స్పష్టం చేశారు. "సాంకేతికంగా చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదు. ఆయన సీఎం. కానీ, అధికారాలు ఉండవు. అంతే. మే 23న టీడీపీ ప్రభుత్వం మరోసారి ఎన్నికైతే సరే. లేకపోతే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారు. అది మే 24 కావొచ్చు. లేకపోతే ఆయనకు మంచిదనిపించిన రోజు కావొచ్చు." అంటూ ఎల్వీ వ్యాఖ్యలు చేసారు. ఒకవేళ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి లాంటిది ఏర్పడితే, అప్పుడు ఏం చేయారని ప్రశ్నించగా ‘అప్పుడు కూడా ముఖ్యమంత్రి తటస్తంగా ఉంటారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని నిబంధనలకు లోబడి ముఖ్యమంత్రి అధికారులకు మార్గనిర్దేశం చేయవచ్చు.’ అని చెప్పారు.
ఏప్రిల్ 6 తర్వాత నుంచి ఇప్పటి వరకు చంద్రబాబునాయుడు తనను ఎలాంటి సమీక్షలకు పిలవలేదని తెలిపారు. కొందరు కలెక్టర్లు సహకరించడం లేదన్న వాదన రావడంతో ఒక చీఫ్ సెక్రటరీగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో కలసి కలెక్టర్లతో సమీక్ష నిర్వహించినట్టు చెప్పారు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు నిధులు ఇవ్వకుండా ఎల్వీ సుబ్రమణ్యం అడ్డుకుంటున్నారంటూ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు చేసిన ఆరోపణలను సీఎస్ ఖండించారు. సంక్షేమ పథకాలకు నిధులు ఆపేయాలని తాను ఆర్థిక శాఖకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. యనమలకు ఏమైనా సందేహాలు ఉంటే, తనను కలవచ్చని చెప్పారు.