ఈనెల 10న ఏపీ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలంటూ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు సీఎం కార్యాలయం నుంచి నోట్ వెళ్లింది. అయితే కేబినెట్ నిర్వహణపై సమాలోచనలు చేశారు. మంగళవారం మధ్యాహ్నం సీఎం కార్యదర్శి సాయి ప్రసాద్, జీఏడీ పొలిటికల్ కార్యదర్శి శ్రీకాంత్తో సీఎస్ సమావేశమయ్యారు. భేటీ పూర్తయిన అనంతరం సీఎస్ సుబ్రహ్మణ్యం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ నెల 10న కేబినెట్ నిర్వహణ అనుమానమేనని సీఎస్ చెప్పుకొచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి మేరకే కేబినెట్ నిర్వహణ ఉంటుందన్నారు. అజెండాలో అంశాలపై ఈసీఐ అనుమతి ఇస్తేనే కేబినెట్ భేటీ ఉంటుందని సీఎస్ తేల్చిచెప్పారు.
అసాధారణ పరిస్థితులు ఉంటేనే కేబినెట్ నిర్వహణకు అనుమతి ఉంటుందన్నారు. తప్పనిసరిగా చర్చించాల్సిన అంశాలు ఉంటేనే కేబినెట్లో పెడతామన్నారు. ఏయే అంశాలు అజెండాలో పెట్టాలనేది సీఎం కార్యాలయం సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. సీఎంవో ఇచ్చే అజెండాపై ఆయా శాఖల నుంచి వివరాలు తీసుకుంటామన్నారు. శాఖలు ఇచ్చిన సమాచారాన్ని సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ పరిశీలిస్తోందని.. ఈసీకి పంపించాల్సిన అంశాలు ఇక్కడినుంచి పంపిస్తామన్నారు. ఈసీఐకు 48 గంటలు ముందు సమాచారం ఇవ్వాలని సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.
ఈనెల 10 ఏపీ కేబినెట్ సమావేశంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. ఎన్నికల కోడ్ను అనుసరించే ఏపీ మంత్రివర్గ సమావేశం ఉండాలని అన్నారు. ఎన్నికల కోడ్ ప్రకారమే నేతలు, అధికారులు నడుచుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇప్పటికే అన్ని పార్టీలకు, అధికారులకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పుస్తకాలు పంపామని ఆయన అన్నారు. అనుమానాలు ఉంటే సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తామిచ్చిన పుస్తకాల్లో అన్ని వివరాలు ఉన్నాయని, అవి చదువుకుని, చర్యలు తీసుకోవాలని ద్వివేది చెప్పారు. రాజకీయ నేతలు చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించనని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.