తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాసారు. "శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసు అధికారులు పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వినుకొండలో పిట్టంబండ, ముమ్మిడివరం, చెట్టుపల్లి గ్రామాల్లో తెదేపా నేతలను సీఐ వేధిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న శ్రీ మక్కెన కోటయ్య, శ్రీ రసపుత్ర మల్లిఖార్జునరావు, శ్రీమతి కర్రి భారతమ్మ, శ్రీమతి జిట్ర యశోదలను సీఐ వేధిస్తున్నాడు. పోటీ చేస్తున్న అభ్యర్థులు వారి పిల్లలపై సీఐ అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారు. సీనియర్ తెదేపా నాయకులు శ్రీ మక్కిన కొండలరావుపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు కూడా చేశారు. వీటిని నిరసనగా ఎమ్మార్వో, ఎంపీడీవో ఆఫీసుల వద్ద పిట్టంబండ, ముమ్మిడివరం, చెట్టుపల్లి గ్రామస్తులతోపాటు మాజీ శాసనసభ్యులు శ్రీ జి.వి.ఆంజనేయులుగారు ఆందోళనలో పాల్గొన్నారు. అధికార పార్టీ నేతల మెప్పు కోసం జీవీ ఆంజనేయులుగారితోపాటు తెలుగుదేశం పార్టీ నేతలపై సెక్షన్ 143, 149, 188, 341 కింద కేసులు నమోదు చేశారు. మాచర్ల నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను శ్రీ భక్తవత్సలరెడ్డి వేధింపులకు గురిచేస్తున్నారు. నామినేషన్లు ఉపసంహరించుకోకపోతే తప్పుడు కేసులతో వేధిస్తామంటూ బెదిరిస్తున్నారు.
"మాచర్ల పరిధిలో 77 పంచాయతీలకుగాను, 72 పంచాయతీలు ఏకగ్రీవం చేశారు. మిగిలిన వాటిల్లో అభ్యర్థులను వేధిస్తున్నారు. వినుకొండ, మాచర్ల నియోజకవర్గాల్లో జరిగిన పరిణామాలపై లోతైన విచారణ జరిపి సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకుని తెదేపా నేతలపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేయాలని కోరుతున్నాం. ఎన్నికలు సజావుగా జరిగేందుకు వినుకొండ, మాచర్లలో అదనపు భద్రతా బలగాలను అందించాలి. ఎలక్షన్ కమిషన్ వెంటనే తగిన చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. చిత్తూరు జిల్లా కుప్పం మండలం మిట్టపల్లి పంచాయతీలో అధికారులు, మీడియా సమక్షంలో ఉపసంహరించుకున్న ఇద్దరి నామినేషన్లను ఆమోదించాలని వైసీపీ నేతల ఒత్తిడి చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకొని స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలి. తుది జాబితాలో నామినేషన్లు ఉపసంహరించుకున్నవారి పేర్లు లేకుండా జాబితా పారదర్శకంగా ఉండేలా చూడాలి." అని చంద్రబాబు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసారు..