తరాల కరవును కసితీరా తరిమికొట్టేలా కృష్ణమ్మ బిరబిరా పరుగులెత్తింది. బీడు వారిన భూముల్లో సిరులు కురిపించేలా గలగలా కదిలి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్ప దీక్ష.. అధికారుల నిరంతర పర్యవేక్షణ ఫలించింది. అనంతపురం జిల్లాకు చిట్ట చివరన, ఎక్కడో మూలకు విసిరేసినట్లు, కర్ణాటక రాష్ట్రానికి ఆనుకొని ఉండే మడకశిర నియోజకవర్గానికి కృష్ణమ్మ బుధవారం తరలివచ్చింది. దశాబ్దాల స్వప్నం సాకారమై.. లోగిళ్లు సస్యశ్యామలం కానున్న శుభ తరుణంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ సందర్భంలో, ఈనాడులో వచ్చిన "మడకశిర మురిసింది" అనే శీర్షిక చూసి, 30 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన గుర్తు చేసిన జర్నలిస్ట్..
"1986 లో అనంతపురంజిల్లా “ఎప్పమాను” వద్ద టీ దుకాణం పక్కన ఒక రైతు ఆరోజు ఈనాడు పేపర్ నేలమీద పరచి గోదావరి వరద ఫొటోలను చూస్తూ “ఇన్ని నీళ్ళా” అని ఆశ్చర్యపోయారు. రాయలసీమ కరువుకథలు రాసే టూర్ లో వున్న నాకూ (ఈనాడు - XXXX) న్యూస్ టైమ్-XXXX కి ఈ ఒక్క సన్నివేశంలోనే, “ఇన్నినీళ్ళా” అన్న ఒక్కమాటతోనే అక్కడ కరువులోతు తెలిసింది. ఫొటోగ్రాఫర్ XXXX రైతు నీళ్ళ ఫొటో చూస్తున్న ఫొటో తీశాడు. పతంజలిగారు ఫస్ట్ పేజీలో దాన్ని బాగా ఫీచర్ చేశారు. “మడకశిర మురిసింది” వార్త చూశాక “ఇన్నినీళ్ళా సంఘటన 32 ఏళ్లకు మళ్ళీ జ్ఞాపకానికి వచ్చింది. దీంతోనే రాయలసీమ కరువుతీరిపోతుందని కాదు.అయితే, ఆదిశగా ఒక అడుగుపడింది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు." అని ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు. (నోట్ : వారి ప్రైవసీకి భంగం కలిగించకూడదని, పేరులు ఉన్న చోట XXXX అని పెట్టటం అయినది)
ఇది మడకశిర స్వరూపం : హంద్రీనీవా సుజల స్రవంతి రెండో దశలో భాగమైన మడకశిర బ్రాంచి కాల్వలో చివరి ప్రాంతానికి కృష్ణమ్మ చేరుతోంది. అనంతపురం జిల్లాలోని హంద్రీనీవా ప్రధాన కాల్వలోని 304.400 కి.మీ.వద్ద మడకశిర బ్రాంచి కాల్వ మొదలవుతుంది. ఇది మొత్తం 171.015 కి.మీ.ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ అక్కడ అగళి మైనర్ కాల్వ (33.340 కి.మీ.లు), అమరాపురం మైనర్ కాల్వ (25.100 కి.మీ.)గా విడిపోతుంది. మొత్తంగా ఈ మడకశిర బ్రాంచి కాల్వ ద్వారా 275 చెరువులను నింపడంతోపాటు 43 వేల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా నీరివ్వడం, ఈ కాల్వ పరిధిలో ఉన్న గ్రామాల్లో తాగునీటి కష్టాలు తీర్చాలనేది లక్ష్యం. మడకశిర బ్రాంచి కాల్వపై మొత్తం 17 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఈ కాల్వపై 8.65 వ కి.మీ. వద్ద గొల్లపల్లి జలాశయం ఉంది. అక్కడి నుంచి గత ఏడాది లేపాక్షి వరకు కృష్ణా జలాలు తీసుకెళ్లగలిగారు. మరికొన్ని చోట్ల పనులు పూర్తికాకపోవడంతో, మడకశిర వరకు నీరు చేరలేదు. ఈసారి మాత్రం ఎలాగైనా నీరివ్వాల్సిందే అని హంద్రీనీవా ఇంజినీర్లకు ముఖ్యమంత్రి లక్ష్యాన్ని నిర్దేశించడమే కాకుండా, ప్రతి సోమవారం దీనిపై సమీక్ష జరుపుతూనే ఉన్నారు. దీంతో గుత్తేదారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చి చివరకు మడకశిర నియోజకవర్గ కేంద్రం వరకు కాల్వ పనులు పూర్తిచేయగలిగారు. ప్రస్తుతం ఈ కాల్వలో 11 ఎత్తిపోతల పథకాలు దాటి మడకశిర మండలంలోని 127వ కి.మీ. వద్ద సి.కొడిగేపల్లిలోకి బుధవారం ఉదయం నీరు చేరింది.