బీజేపీ-వైసీపీ అనైతిక పొత్తుపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న బీజేపీ నేత‌లు ఒక్కొక్క‌రూ బ‌య‌ట‌ప‌డుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థుల‌కు డిపాజిట్లు కోల్పోవ‌డంతో ఆక్రోశం వెళ్ల‌గ‌క్కుతున్నారు. ఏపీలో బీజేపీ-వైసీపీ ఒక‌టే అని ప్ర‌జ‌లు భావిస్తున్నార‌ని మొన్న విష్ణుకుమార్ రాజు కుండ‌బ‌ద్ద‌లు కొట్ట‌గా, నేడు ఎమ్మెల్సీగా ఓడిపోయిన సీనియ‌ర్ బీజేపీ నేత మాధ‌వ్  వైసీపీతో అనైతిక పొత్తు వ‌ల్ల  బీజేపీ ఎంత న‌ష్ట‌పోతుందో వివ‌రించారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గతంతో పోల్చుకుంటే భాజపాకు వచ్చిన ఓట్ల శాతం పెరిగింద‌ని, విశాఖలో మాత్రం ఓట్ల శాతం తగ్గింద‌న్నారు. జనసేనతో కలిసి ఉన్నా క‌లిసి లేనట్టేనని భావిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. జనసేనతో కలిసి భాజపా ప్రజల్లోకి వెళ్తేనే పొత్తు ఉందని నమ్ముతార‌ని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన బీజేపీతో కలిసి రాలేద‌ని వ్యాఖ్యానించారు. పీడీఎఫ్ అభ్య‌ర్థి త‌మ‌కు జ‌న‌సేన మ‌ద్ద‌తు ఉంద‌ని ప్ర‌క‌టించార‌ని, దీనిని ఖండించమని జనసేనను కోరినా స్పందించ‌లేద‌ని వాపోయారు. మ‌రోవైపు వైసీపీ చేసే త‌ప్పుడు ప‌నుల‌న్నీ బీజేపీ మెడ‌కు చుట్టుకుంటున్నాయ‌నే అర్థం వ‌చ్చేలా న‌ర్మ‌గ‌ర్భంగా మాధ‌వ్ మాట్లాడారు. బీజేపీ హైకమాండుకు చెప్పే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని వైకాపా ప్రచారం చేస్తోంద‌ని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ విషయాన్ని ప్రజలు నమ్మారని చెప్పుకొచ్చారు. వైకాపా బీజేపీపై వేస్తున్న ఈ అపవాదును తుడుచుకునే ప్రయత్నం చేస్తామ‌న్నారు. మే నెలలో రాష్ట్ర ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ వేస్తామ‌న్నారు. పొత్తుల విషయంలో అనేక ఆలోచనలు ఉన్నాయ‌ని, అయితే  ఆ విషయాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుంద‌ని మాధ‌వ్ వివ‌రించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read